అమరావతి, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): పంచాయతీ ఎన్నికలకు నిబంధనలకు విరుద్ధంగా మేనిఫెస్టో విడుదల చేసి, దాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసిన చంద్రబాబుపై ఎన్నికల దుష్ప్రవర్తన కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డిమాండు చేశారు. అప్పిరెడ్డి, మరికొంతమంది పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జనవరి 28వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రవర్తన నియమవళిని ఉల్లంఘించి ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గత నెల 29వ తేదీ ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషనర్ 5 రోజుల తరువాత మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్నారన్నారు.
అయితే, అప్పటికే టీడీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని తెలిసీ కూడా ఎన్నికల కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. గతంలో ఇదే కమిషనర్ ఉన్నతాధికారులు, మంత్రులను తీవ్రపదజాలంతో దూషిస్తూ గవర్నర్‌కు లేఖ రాశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై కూడా ఎన్నికల కమిషనర్ తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబుపై ఎన్నికల దుష్ప్రవర్తన కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు ఎస్ఈసీని కోరారు.