ఏపీ ఐటీ రంగం మరింత బలోపేతం: గౌతంరెడ్డి

విశాఖపట్నం, జనవరి 21 (న్యూస్‌టైమ్): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఉదయం మంత్రి అవంతి శ్రీనివాస్ నివాసంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో పాటుగా వివిధ పారిశ్రామిక వర్గాలతో జిల్లాలో ఉన్న సమస్యలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ, టూరిజం శాఖ సంయుక్తంగా ఒక మీటింగ్ విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం తీసుకు వస్తామని, అందుకు సుమారు ఐదు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మెడిటెక్ జోన్, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వ్యవస్థ అని, దీనివల్ల ఇప్పుడు అనేక ఉత్పత్తులు మనకు తక్కువ ధరకు లభించాయని మంత్రి గౌతం‌రెడ్డి పేర్కొన్నారు.

అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ‘‘రామతీర్థం ఘటనపై భక్తులు అందరూ బాధపడ్డారు. చంద్రబాబు మాత్రం రాజకీయం చేశారు. రాముణ్ణి చూడటానికి బూట్లు వేసుకుని వెళ్లిన సంస్కారం చంద్రబాబుది. విజయసాయిరెడ్డిపై ఒక విధంగా హత్యాయత్నం జరిగింది. బులెట్ ఫ్రూఫ్ వాహనం లేకపోతే సాయిరెడ్డి ప్రాణానికే ప్రమాదం వాటిల్లేది. దాడిలో కారు అద్దాలు దెబ్బతిన్నాయి. విజయసాయిరెడ్డిపై దాడిని నిరోధించాల్సినది పోయి రెచ్చగొట్టారు. పోలీసులు చట్టపరిధిలో విచారణ జరిపి బాధ్యులను గుర్తించారు. కళా వెంకట్రావు అరెస్ట్ అందులో భాగమే. రాజ్యసభ సభ్యుడిపై రాళ్లు, కర్రలు విసరడం ఉన్మాదమా, అందుకు ప్రోత్సహించిన వారిని అరెస్ట్ చేయడం ఉన్మాదమా? ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.’’ అని అన్నారు.

‘‘ఉత్తరాంధ్ర ప్రశాంతత దెబ్బతీయవద్దని కోరుతున్నాం. వైసీపీ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ సహించలేకే తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు నిరసనలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ మంచి కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు నిరసనలకు పిలుపు నివ్వడం అలవాటు. రేషన్ రవాణా ట్రక్కుల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నిరసనలకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. కళా వెంకటరావు వ్యవహారంలో పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.’’ అని అన్నారు.

Latest News