స్థానికం

చంద్రబాబుది ఆల్‌ బేవర్స్‌ అండ్‌ ఛీటర్స్‌ డెకాయిట్స్‌ పార్టీ

విశాఖపట్నం, మార్చి 5 (న్యూస్‌టైమ్): చంద్రబాబుది ఆల్‌ బేవర్స్‌ అండ్‌ ఛీటర్స్‌ డెకాయిట్స్‌ పార్టీ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అభివర్ణించారు. విశాఖలో చంద్రబాబు హయాంలోనే భూ ఆక్రమణలు జరిగాయని స్పష్టం చేశారు. విశాఖను ప్రశాంత నగరంగా రూపొందించాలని సీఎం వైయస్‌ జగన్‌ కాంక్షిస్తున్నారని చెప్పారు. విశాఖను రాజధాని చేయడానికి వీల్లేదన్న చంద్రబాబు, లోకేష్‌లు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌లతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ నిర్వహించిన రాష్ట్ర బంద్‌లో వైయస్‌ఆర్‌సీపీ పూర్తిస్థాయిలో పాల్గొంది. ప్రభుత్వం బస్సులను మధ్యాహ్నం వరకు నిలిపివేసింది. ఆ తరువాత కూడా డ్రైవర్లు, కండెక్టర్లు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ప్రైవేటీకరణను మా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని మా సీఎం చెప్పారు. బాధ్యత లేని నాయకులు విశాఖలో ఏం చేస్తున్నారో మనందరం తెలుసుకోవాలి. సింహాం కడుపున సింహమే పుడుతుంది. పిల్లి పుట్టదు కదా? మహానేత వైయస్‌ఆర్‌ కడుపున వైయస్‌ జగన్‌ పుట్టారు. నక్క కడుపున నక్కే పుడుతుంది. చంద్రబాబు గుణాలతో పుట్టిన నారా లోకేష్‌ కూడా నక్క బుద్దులే ప్రదర్శిస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘పప్పునాయుడు చంద్రబాబు మాదిరిగానే వక్రబుద్ధితో ఆలోచిస్తున్నారు. కపటాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు, అన్యాయం ఇవే బుద్దులు ఆయనలో ఉన్నాయి. విశాఖలో పేద, మధ్య, అన్ని సామాజిక వర్గాలు చల్లగా ఉండాలన్నదే వైయస్‌ఆర్‌సీపీ విధానం. విశాఖలోకి గద్దలు రాకూడదని, రాబందులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాబందులు, గద్దలు లేని విశాఖను నిర్మిస్తున్నాం. పేదలకు మా ప్రభుత్వం భూములు, ఇళ్ల స్థలాలు ఇస్తోంది. చంద్రబాబు హయాంలో తన వాళ్లకు భూములు కట్టబెట్టారు. దొంగతనంగా భూములు రాయించుకున్నారు. టీడీపీని తెలుగు దొంగల పార్టీ అంటారు. ఏబీసీడీ అంటూ పప్పు నాయుడు చెప్పారు. ఆయన డిక్షనరీ ప్రకారం ఆల్‌ బేవర్స్‌ ఛీటర్స్‌ డెకాయిట్స్‌ పార్టీ టీడీపీనే. కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి ఒక్కటీ రాదు. దీంతో తెలుగు దేశం పార్టీ చాప్టర్‌ క్లోజ్‌ అయ్యింది. చంద్రబాబు సినిమాకు ఈ ఎన్నికలతో క్లోజ్‌ చేస్తున్నారు. కబ్జాలు, దొంగలు లేని విశాఖను నిర్మిస్తున్నాం. ఈ నగరాన్ని తీర్చిదిద్దుతాం. 1.90 లక్షల ఇళ్ల స్థలాలు విశాఖలో సీఎం వైయస్‌ జగన్‌ ఇవ్వబోతున్నారు. అన్ని వర్గాలకు, మతాలకు లబ్ధి చేకూర్చేవ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. కొంత మందికే మేలు చేసే వ్యక్తులను ముఠానాయకుడు అంటారు.’’ అని విమర్శించారు.

‘‘చంద్రబాబు ఒక ముఠానాయకుడిగా మారాడు. వైయస్‌ జగన్‌ దృష్టిలో విశాఖ ఒక ప్రశాంతమైన, అందమైన నగరంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్ష. విశాఖకు మంచి జరుగుతుంటే చంద్రబాబుకు మనస్సు ఒప్పడం లేదు. ఉత్తరాంధ్రకు న్యాయం చేయడం చంద్రబాబుకు ఇష్టం లేని కార్యం. ఈ దుర్మార్గుడు ఏ ముఖం పెట్టుకొని విశాఖలో అడుగుపెడతారు. రాజధాని అమరావతిలోనే పెట్టాలన్న ఈ దుర్మార్గులు ఎలా వస్తారు. ఉత్తరాంధ్ర ద్రోహులను విశాఖలో అడుగుపెట్టనివ్వకూడదు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. కొంత ఆలస్యం కావచ్చు కానీ, విశాఖకు రాజధాని రావడం తథ్యం. తండ్రీ కోడుకులు మోసగాళ్లు. ఈ మోసగాళ్లను ఉత్తరాంధ్రలో కాలు పెట్టనివ్వదని కోరుతున్నాను. రాబంధులు, కబ్జాలు లేని విశాఖగా తీర్చిదిద్దాలని వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తున్నారు. గద్దలకు కాకుండా పేదలకు భూములు ఇస్తున్నాం. గతంలో భూ కబ్జాలు చేసిన వ్యక్తులు చేసింది ఎవరో అందరికీ తెలుసు. అందుకే టీడీపీని తెలుగు దొంగల పార్టీగా పరిగణిస్తున్నాం. రాబోయే అన్ని ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయదుందుభి మోగిస్తుంది.’’ అని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సూచించారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు విశాఖలో ఓట్లు అడిగేందుకు వస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రం తన నిర్ణయం ఉపసంహరించుకునేలా పోరాడి ఓట్లు అడిగితే బాగుంటుందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పిందని, అక్కడ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టకపోగా, ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తామనడం సరికాదన్నారు. ‘‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రాణత్యాగాలు చేశారు. కేంద్ర తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. చంద్రబాబుకు ప్రధానికి లేఖ రాసే దమ్ము, ధైర్యం లేదు. సీఎం వైయస్‌ జగన్‌ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు. ప్రత్యామ్నయ మార్గాలు సూచించారు. కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి వారికి భరోసా కల్పించారు. చంద్రబాబు, లోకేష్‌లు మోదీని ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు. మోదీ పేరు చెబితే చంద్రబాబుకు వణుకుతున్నారు. లోకేష్‌ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందా? వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఉందా అన్నది లోకేష్‌కు తెలియడం లేదు. దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ నేతలు ఢిల్లీలో మాట్లాడారు. మా ఎంపీలు విశాఖ ఉక్కు కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. ఇవాళ నిర్వహించిన బంద్‌లో విశాఖలో ఇద్దరు మంత్రులం, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల కోసం గల్లీ గల్లీ తిరుగుతున్నారు. నమ్మకం ఉంటే చాలు గల్లీగల్లీ తిరగాల్సిన అవసరం లేదు. మాకు వైయస్‌ జగన్‌ బొమ్మ ఉంటే చాలు మాకు ఓట్లు వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గుర్తు లేని ఎన్నికల్లోనే మా పార్టీ మద్దతుదారులు 85 శాతం ఎన్నికయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ఎన్నికలంటే మాకు ఎలాంటి భయం లేదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకపక్షంగా ఎన్నికవుతారు. అదే నిజమవుతుంది. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతారు. మెట్రో రైల్‌ వేయాలని, 24 గంటలు తాగునీరు ఇవ్వాలని,భోగాపురం ఎయిర్‌ పోర్టు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకుంటే మెట్రో నగరాలతో పోటీ పడవచ్చు. ,చంద్రబాబు విశాఖను 2014లోనే రాజధానిగా ఏర్పాటు చేసి ఉంటే ఇప్పటికీ బ్రహ్మండంగా అభివృద్ధి చెందేదే. ఇప్పుడు వైయస్‌ జగన్‌ రాజధాని చేస్తామంటే టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి విశాఖ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుకుంటున్నారు. టీడీపీపైన ప్రజలకు ఎంత కసి ఉందన్నది రేపు జరిగే ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపుతారు. నిన్న కర్నూలుకు చంద్రబాబు వెళ్తే న్యాయవాదులు అడ్డుకున్నారు. ఇకనైన చంద్రబాబు అభివృద్ధికి అడ్డుపడకుండా ఆలోచన విధానాన్ని మానుకోవాలని, విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. విశాఖ నగర అభివృద్ధి కోసం వైయస్‌ జగన్‌ చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.’’ అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.