రాష్ట్రీయం

ఇళ్ల స్థలాలు, నిర్మాణంపై సీఎం సమీక్ష

అమరావతి, జనవరి 27 (న్యూస్‌టైమ్): ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న‌ ఇళ్ల స్థలాల ప‌ట్టాల‌ పంపిణీ, గృహ నిర్మాణంపై సీఎం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు, ఉన్నతాధికారులు హాజరయిన ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చ జరిగింది. ఒకవైపు, పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి స్వయంగా ఇలాంటి సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. లబ్ధిదారులు ఎలా కావాలంటే అలా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం తెలిపారు. ‘‘లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే ఇళ్లు కట్టించి ఇస్తాం. మెటీరియల్‌ ఇవ్వండి, లేబర్‌ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తాం. లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యం.’’ అని సీఎం స్పష్టం చేశారు.

ప్రతి లేఅవుట్‌ను ఒక యూనిట్‌గా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సెంట్రింగ్‌ వంటి పనులకు అవసరమైన సామాగ్రిని అక్కడే సిద్ధం చేసుకోవాలని, దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణం చురుగ్గా ముందుకు సాగుతుందని సీఎం తెలిపారు. ఇటీవల వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైన విధంగా డ్రైయిన్లు నిర్మాణం, ఇతరత్రా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం లేకుండా, సమస్యలు లేకుండా చూడాలని, ప్రతి లే అవుట్‌పైనా సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయాలని, దీని తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

‘‘మనం కట్టేవి ఇళ్లు కావు, ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలి. వీధి లైట్ల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటు చేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి పెట్టాలి. ప్రతి లే అవుట్‌లో నమూనా ఇంటిని (మోడల్‌ హౌజ్‌) నిర్మించాలి.’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.