రాజకీయం

బెజవాడ టిడిపిలో అసమ్మతి సవాల్

విజయవాడ, మార్చి 7 (న్యూస్‌టైమ్): విజయవాడ టిడిపి అసమ్మతివాదులు ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఎందుకు పార్టీ అధిష్టానానికి సవాల్‌ విసిరారు? గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న గ్రూపు గొడవలను ఇటీవలే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సరిదిద్దినా ఆయన పర్యటనకు ముందుకు ఎందుకు వీరు ఆల్టిమేల్టం జారీ చేశారు? వీరి వెనుక ఉన్న వారెవరు? ఇప్పుడు అధిష్టానం వీరు ఇచ్చిన ఆల్టిమేటాన్ని ఎలా తీసుకుంటుంది? తాము కావాలో కేశినేని కావాలో తేల్చుకోవాలంటే? అర్థం ఏమిటి? పార్టీలో ఉండమనా? లేక అధిష్టానానికి కులముద్ర వేయాలనే తలంపుతో ప్రత్యర్థులతో చేతులు కలిపారా? విజయవాడ టిడిపిలో అసమ్మతి ఇదే మొదటిసారి కాదు. ఎంపీ నానిపై పలుసార్లు బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు, నాగుల్‌మీరా తదితరులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఆయన తమను అవమానిస్తున్నారని, తమను తీసివేస్తున్నారనే బాధ ప్లస్‌ అధినాయకుడు చంద్రబాబుకు విలువ ఇవ్వడం లేదనే సాకుతో వీరు ప్రతిసారీ పార్టీని ఇబ్బందులు పెడుతున్నారనే మాట సామాన్య కార్యకర్తల నుంచి వస్తోంది. విజయవాడ ఎంపి తీరు బాగాలేకపోతే బయటపడాల్సిన సమయం ఇదా? ఎందుకు వీరు ఇప్పుడు అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతున్నారు? మేము కావాలో వారు కావాలో తేల్చుకోవాలంటే అధిష్టానం ఏమి చేస్తుంది? కీలకమైన సమయంలో అధిష్టానాన్ని ఇబ్బంది పెడితే తరువాత భవిష్యత్‌ ఏమిటో వీరు లెక్క వేసుకున్నారా? లేక పార్టీని వీడిపోవడానికే ఆల్టిమేల్టం ఇచ్చారా? అనే ప్రశ్నలు సామాన్య పార్టీ కార్యకర్త నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు ప్రశ్నిస్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో అధికారపార్టీ ఎన్ని రకాలుగా వేధించినా, బెదిరించినా అదరకుండా పార్టీకి గౌరప్రదమైన స్థానాలు దక్కుంచుకుని, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుతామనే భావనతో అధినేత చంద్రబాబు ప్రచారభేరి మ్రోగించి రాష్ట్రంలో కలయతిరుగుతున్న సమయంలో విజయవాడ టిడిపి అసమ్మతినాయకులు బుద్దా వెంకన్న, బోండా, నాగుల్‌మీరాలు ఇచ్చిన ఆల్టిమేల్టం పార్టీలో చర్చకు తావిస్తోంది. వారు ముగ్గురూ పార్టీని వదిలిపోతారని, భవిష్యత్‌లో తమకు టిక్కెట్లు వస్తాయో రావోనన్న బెంగతోనే వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే మాట పలు వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌లో తనకు సీటు ఇస్తారో ఇవ్వరోనన్న శంకతోనే బోండా తిరుగుబాటు చేశారంటున్నారు. ఆ స్థానాన్ని వంగవీటి రాధాకృష్ణకు ఇస్తారేమోనన్న భయం, అధిష్టానం తనను పక్కకు తప్పిస్తుందన్న భయంతోనే ఆయన ఈ విధంగా ఆల్టిమేల్టం ఇచ్చారంటున్నారు. మరోవైపు మైనార్టీ వర్గానికి చెందిన నాగుల్‌మీరాకు జలీల్‌ఖాన్‌తో ఇబ్బందులు ఉండడం, ఇక తనకు టిక్కెట్‌ రాదు అనే భావనతో ఆయన వారితో కలిసారంటున్నారు. ఇక బుద్దా వెంకన్న అధినేతకు విధేయుడే అయినా ఆయన స్వంత పార్టీ నాయకులపై ఎక్కుపెట్టే విమర్శలను ఎవరూ సమర్థించడం లేదు. మొత్తం మీద పంపీ వ్యవహారశైలితోనే తమకు ఇబ్బందులని చెప్పిన నాయకులు నాలుగు రోజులు ఓర్చుకుంటే తరువాత..పరిస్థితి చక్కబడేదని, కానీ కీలక సమయంలో వారు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. వారు పార్టీని వీడిపోవడానికి కానీ, లేక ప్రత్యర్థిపార్టీకి సహకరించడానికి కానీ ఈ విధంగా వ్యవహరిస్తున్నారో భావన పార్టీ వర్గాల్లో ఉంది.