జాతీయం

నామ్రుప్‌లో యూరియా ప్లాంట్‌ ఏర్పాటు

న్యూఢిల్లీ, జనవరి 21 (న్యూస్‌టైమ్): అస్సాం రాష్ట్రంలోని నామ్రుప్‌లో ఏర్పాటు కానున్న 12.7 లక్షల ఎమ్‌ఎమ్‌టిపిఎ సామర్థ్యం గల యూరియా ప్లాంట్‌కు సంబంధించి కేంద్ర రసాయన, ఎరువుల మంత్రి డి.వి. సదానంద గౌడ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి, అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ, అస్సాం పరిశ్రమ, వాణిజ్య మంత్రి చంద్ర మోహన్ పటోవరీ, ఆర్కె చతుర్వేది, కార్యదర్శి (ఎరువులు), ధరం పాల్, అదనపు కార్యదర్శి (ఎరువులు), సుశీల్ చంద్ర మిశ్రా, సిఎండి (ఆయిల్), ఎస్. ముద్గేరికర్, సిఎండి (ఆర్‌సిఎఫ్), అసిమ్ కుమార్ ఘోష్, సిఎండి (బివిఎఫ్‌సిఎల్), నిర్లేప్ సింగ్ రాయ్, డైరెక్టర్ (ఎన్‌ఎఫ్‌ఎల్) తదితరులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధే ప్రాధాన్యత అని గౌడ అన్నారు. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటానికి ప్రధానమంత్రి నిర్దేశం మేరకు నామ్రుప్‌ వద్ద అత్యాధునిక సాంకేతికతో యూరియా యూనిట్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తురు. ఈ యూరియా యూనిట్ ద్వారా స్థానిక రైతుల యూరియా డిమాండ్లను తీర్చడమే కాకుండా మిగిలిన ఉత్పత్తిని దక్షిణ ఆసియాలోని పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారి అంతర్గత ప్రక్రియను త్వరగా ముగించిన పిఎస్‌యు సిఎండిల పనితీరును మంత్రి ప్రశంసించారు.

నామ్రుప్‌ ప్రాజెక్టుకు వీలైనంత ఆర్ధిక సాయంతో పాటు అన్ని రకాల సహకారాన్ని అందించడానికి అస్సాం ప్రభుత్వం సిద్ధంగా ఉందని బిస్వాస్ తెలియజేశారు. స్థానిక అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి నామ్రుప్‌- IV యూనిట్ ముఖ్యమని, అందువల్ల ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తేలి అన్నారు. అస్సాం ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందిస్తుందని పటోవరీ తెలిపారు. రాబోయే ప్రాజెక్ట్‌కు కూడా ఆ ప్రోత్సాహకాలు పొందవచ్చని చెప్పారు. నామ్రుప్‌ ప్రాజెక్టుపై తమ అంతర్గత ప్రక్రియను వేగవంతం చేయడానికి సంబంధిత పిఎస్‌యుల సిఎండిలు అంగీకరించారు. ఈ ప్రాజెక్టుకు సహకరించినందుకు పాల్గొన్న వారికి / వాటాదారులకు కేంద్ర మంత్రి గౌడ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యేలా చూడటం తన మంత్రిత్వ శాఖ ఉద్దేశం అని అన్నారు.