గాడ్సే వారసుల పాలన
నిరసన దీక్షలో వక్తల ఆవేదన…
విజయవాడ, జనవరి 30 (న్యూస్‌టైమ్): జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే వారసుల పరిపాలనలో రైతాంగానికి, కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని, పోరాడి సాధించుకున్న చట్టాలను కాలరాస్తున్నారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బిజెపి సంఘపరివార్ విద్రోహశక్తులు చేస్తున్న అరాచకాలను, పోలీసు కాల్పులను నిరసిస్తూ రైతు ఉద్యమానికి మద్దతుగా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాడు నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
సీనియర్ పాత్రికేయులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు ముఖ్యఅతిథిగా పాల్గొని అతిథిగా పాల్గొని దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటం వద్ద వక్తలు పూల దండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చలపతిరావు ప్రసంగిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగిస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కట్టుదిట్టమైన రక్షణ వలయంలో సాధారణ ప్రజలకు అనుమతి లేని ఎర్రకోట ప్రాంతాల్లో మోడీ అనుయాయులు సంఘద్రోహులు ముందస్తు ప్రణాళికతో చొరబడి ఎర్రకోటపై జెండాను ఎగరవేయడం అని బాధాకరమని అన్నారు. కొందరు కార్పొరేట్ అనుకూల మీడియా వర్గాలు సైతం ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను కాలరాస్తే, సంక్షేమ చట్టాలను నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోరని ప్రజలు సంఘటితమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె. వి. ప్రసాద్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ 73 ఏళ్ల స్వాతంత్ర భారతదేశాన్ని నేడు గాంధీని చంపిన గాడ్సే వారసుల చేతుల్లో ఉందని, పోరాటాల ద్వారా సాధించుకున్న సంక్షేమ చట్టాలు హక్కులను మార్చివేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా సవరించాలని అన్నారు.
రైతుకు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా స్వామినాథన్ కమిషన్ అమలు చేయకుండా కేవలం రైతు భరోసా పేరుతో ఏదో పది రూపాయలు ఎంగిలి మెతుకులు విదిలిస్తూ రైతులు, కార్మికుల రక్తాన్ని జలగ లాగా అ పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 రోజులుగా శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న రైతులపై విష ప్రచారం జరుగుతుందని అన్నారు. రైతు సంఘం మాజీ నాయకులు వై కేశవరావు రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రధానంగా దేశం వ్యవసాయాధారితమని, ఆ వ్యవసాయం మీద ఆధారపడి నేడు పారిశ్రామీకరణ జరిగిందని అని కోట్లాది మంది రైతులు వ్యవసాయ కార్మికులు కర్షకులు చూస్తున్నారని, నేడు మోడీ ప్రభుత్వం గత ఆరేళ్లలో తన ఆర్ఎస్ఎస్ అజెండాను పక్కాగా అమలు చేస్తుందన్నారు.
ప్రజల మధ్య మతం పేరుతో భాష పేరుతో ప్రాంతీయ అసమానతలు, విద్వేషాలు రెచ్చగొడుతోందని, ప్రశ్నించే వారిని హత్యలు చేస్తున్నారని, మేధావుల్ని అక్రమంగా నిర్బంధించి జైల్లో పెడుతున్నారని, బ్యాంకింగ్, టెలికాం, రైల్వేలు, విమానయాన, ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని అదే క్రమంలో వ్యవసాయ రంగం కూడా కార్పొరేట్లకు ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని, వీరి ఆగడాలు ఎంతోకాలం సాగవు అని అన్నారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్నిడి ఎలమంద రావు, కౌలు రైతు సంఘం కార్యదర్శి జమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయు నాయకులు వి. ఉమామహేశ్వరరావు, వి. కృష్ణయ్య, ఏఐటీయూసీ నాయకులు వియ్యపు నాగేశ్వరరావు, మూలి సాంబశివరావు, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి. రాణి, డిహెచ్‌పిఎస్ కార్యదర్శి బుడ్డి రాయప్ప రైతు సంఘం నాయకులు బుడ్డి రమేష్, మిక్కిలినేని రాధాకృష్ణ రావు, మున్నంగి నరసింహారావు, కొట్టు రమణారావు, మోతుకూరి అరుణ కుమార్, చెరుకుపల్లి సుబ్బారావు, మహిళా సమాఖ్య నాయకులు దుర్గాసి రవణమ్మ, తమ్మిన దుర్గ, డి. సీతారావమ్మ, పుష్ప, చింతాడ పార్వతి, కె. శ్రీదేవి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.