రాజకీయం

గురుమూర్తికి మ‌ద్ద‌తు వెల్లువ‌

తిరుపతి, ఏప్రిల్ 7 (న్యూస్‌టైమ్): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ‘ఫ్యాను’ ప్ర‌భంజ‌నం సృష్టించ‌నుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైయ‌స్సార్‌సీపీకి అత్యధిక మెజారిటీని అందిస్తుంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉండడం అదనపు బలంగా మారింది. దీనికి తోడు రోజు రోజుకు వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఎం. గురుమూర్తికి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. మంగ‌ళ‌వారం వివిధ కుల సంఘాల నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీకి మ‌ద్ద‌తు తెలిపారు. ఈక్రమంలో ‘స్థానిక’ ఫలితాలే పునరావృతమవుతాయని స్పష్టమ‌వుతోంది. రెండో స్థానం నిలబెట్టుకునేందుకే టీడీపీ తంటాలు పడుతోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు.

వైయ‌స్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ప్రధాన పార్టీలు ప్ర‌చారం నిర్వ‌హిస్తుండ‌గా ప్ర‌జ‌లు వారిని ఆద‌రించ‌డం లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నా..ప‌ట్టించుకోవడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును వైయ‌స్ఆర్ సీపీనే కైవసం చేసుకుంటోంది. ఈ క్రమంలో మరింత మెజారిటీతో విజయం సాధించేందుకు కృషి చేస్తోంది. డాక్ట‌ర్ గురుమూర్తి ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. దీనికి తోడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మొత్తం 16,50,453 ఓట్లలో దాదాపు 80 శాతం పోలింగ్‌ నమోదైంది. అందులో 55శాతం 7,22,877 ఓట్లు వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌కు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 37శాతంతో 4,94,501 ఓట్లు సాధించారు. దీంతో వైయ‌స్సార్‌సీపీ 2,28,376 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

వైయ‌స్సార్‌సీ‌పీ ప్రభుత్వం పనితీరు,‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీని తీసుకొస్తాయి అని టీటీడీ చైర్మ‌న్‌, వైయ‌స్ఆర్ సీపీ జిల్లా ఇన్‌చార్జ్ వైవీ సుబ్బారెడ్డి గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు టీడీపీని నమ్మే స్థితిలో లేరని ఈ విషయం తెలియక ఆ పార్టీ నేతలు ఇంకా గెలుస్తామనే భ్రమల్లో బతుకుతున్నారని అన్నారు. టీడీపీ నేతలు నోరూపారేసుకోవడం సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు సింహాలో లేక గుంటనక్కలో ఈ ఉపఎన్నికల్లో తిరుపతి ప్రజలే తమ ఓటు ద్వారా తేలుస్తారని అన్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలతో నవశకానికి నాంది పలికారని చిత్తూరు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ వ్యవహారాల ఇన్‌చార్జ్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ వెంటే జనం ఉన్నారన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో నిర్వహించిన ‘శంఖారావం’ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఇంటి వద్దకే సంక్షేమాన్ని చేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో విశేష స్పందన కనిపిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. స్థానిక సంస్థలకు మించిన మెజార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి గురుమూర్తికి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పల్లె, నగర పోరులో ఫలితాలు చూసి టీడీపీకి భయం పట్టుకుందన్నారు. తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి గురుమూర్తికి అనూహ్య మెజారిటీ వస్తుందన్నారు.

రాజకీయ విలువలు లేని వ్యక్తి చంద్రబాబు అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. దళితులను అవమానించిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. త్వరలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేసే చిత్తశుద్ధి సీఎం వైయస్‌ జగన్‌కే సొంతమన్నారు. పేదవాడి గుండె ఆపరేషన్‌ని కూడా రాజకీయం చేసే వక్రబుద్ధి చంద్రబాబుదన్నారు, పవన్‌ పెళ్లాలను మార్చినట్టే పార్టీలను మారుస్తున్నాడని దుయ్యబట్టారు.