రాష్ట్రీయం

‘జగన్’ సన్నిహితుల ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం నిఘా?

అమరావతి, మార్చి 7 (న్యూస్‌టైమ్): ఓ వైపు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఢిల్లీలో కలిసేందుకు అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నిస్తుండగా మరోవైపు ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓ వైపు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోరుతున్నారు. విశాఖ ఉక్కు, జీఎస్‌టీ బకాయిలు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. గత వారమే జగన్ ఢిల్లీ పర్యటన చేయాల్సి ఉంది. అయితే తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుశ్చేరి, కేరళ, అసోం రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా బిజీగా ఉండడంతో పాటు షెడ్యూల్ టైట్‌గా ఉండడంతో అపాయింట్‌మెంట్ లభించలేదని సమాచారం. అదే సమయంలో అప్పటి నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం ఏపీ అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారని తెలుస్తోంది. రెండు రోజుల్లో పర్యటనకు సంబంధించి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇక వైసీపీ నాయకులు చెబుతున్నట్లు సీఎం పర్యటన అజెండా అదేనా లేక వేరే ఏదైనా ఉందా అనే అంశంపైనా చర్చ నడుస్తోంది. ఇక సీబీఐ దర్యాప్తు వ్యవహారం, న్యాయవ్యవస్థకు సంబంధించి జగన్ లేఖలు ఇలా పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇక తాజాగా, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి సంబంధించి జాతీయ మీడియాలో ఓ కథనం ప్రసారమైందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీఎం జగన్‌కి సన్నిహితులు విదేశాల నుంచి నిబంధనలను అతిక్రమించేలా ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్టు ఫిర్యాదులు అందాయని, ఇప్పటికే కేంద్రం పరిశీలన జరుపుతోందని సంక్షిప్త కథనం ప్రసారమైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ కథనం ప్రకారం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చిక్కుల్లో పడబోతున్నారని సదరు కథనం చెబుతోంది. అంతేకాదు.. ఈ ఫిర్యాదు విదేశాల నుంచి అందిందని చెబుతున్నారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఆ ఫిర్యాదు ఏ దేశానికి సంబంధించిన వారు చేశారు..సెర్బియానా, అమెరికానా, సౌదీనా అనేది ఆ కథనంలో పేర్కొనలేదు. అంతేకాదు.. ఏ విభాగానికి సంబంధించిన లావాదేవీలు అనే సమాచారం కూడా పేర్కొనలేదు. కంపెనీల్లో పెట్టుబడులా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించినవా లేక పన్నులు చెల్లించకుండా జరిగిన లావాదేవీలా అనే విషయం కూడా పేర్కొనలేదు. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అసలు ఈ కథనంలో వాస్తవం ఎంత.. ఆ కథనం ఎప్పటిది అనే వివరాలూ పూర్తిగా లేవు. రిపబ్లిక్ వెబ్‌సైట్లోనూ కనిపించలేదు. సాధారణంగా రిపబ్లిక్ టీవీ ఇలాంటి అంశాలను ప్రైమరీ లిస్ట్‌లో ఎక్స్ క్లూజీవ్ విభాగంలో అప్‌లోడ్ చేస్తుంది. అయితే ఎక్కడా ఆ వీడియో కనిపించకపోవడంతో ఈ కథనం ప్రసారం చేయడం వెనుక మరో కారణం ఏదైనా ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఓవైపు ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, మరోవైపు ఆ కథనం ప్రసారం కావడం చర్చకు కారణం అవుతోంది.