జాతీయం

‘ఉత్తమ వృత్తుల్లో వైద్యవృత్తి ఒకటి’

న్యూఢిల్లీ, మార్చి 8 (న్యూస్‌టైమ్): సంప్రదాయ మూలాల్లోకి వెళ్లడం, పరిశోధనలు, పున:ఆవిష్కరణల కారణంగానే ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాపై పోరాటాన్ని భారతదేశం ముందుండి నడిపిస్తోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనల కారణంగానే కరోనా సవాలును ఎదిరించి సమస్యకు సాంకేతిక పరిష్కారం కనుగొన్నామని ఉపరాష్ట్రపతి అన్నారు. విజ్ఞాన్ భవన్‌లో ఈఎస్ఐసీ వైద్య కళాశాల (ఫరీదాబాద్) తొలి స్నాతకోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగించారు.

భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలతోపాటు విధాన నిర్ణేతలు సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయాల కారణంగానే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మనం విజయం సాధించామని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ‘వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఆశా వర్కర్లు ఇలా కరోనాపై పోరాటంలో ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో కృషిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు. పీపీఈ కిట్లు, సర్జికల్ గ్లవ్స్, మాస్కులు, వెంటిలేటర్లు, చివరకు టీకాను కూడా తక్కువ సమయంలో ఉత్పత్తిచేసిన భారతీయ పరిశ్రమను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.

ప్రతి విద్యార్థి జీవితంతో గ్రాడ్యుయేషన్ డే ఎంతో ప్రత్యేకమన్న ఉపరాష్ట్రపతి, జీవితంలో తర్వాతి దశలో సేవ చేసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ‘స్వార్థం లేకుండా చిత్తశుద్ధితో మానవాళికి సేవకోసం మీరు చేసే సేవ ద్వారా అనంతరమైన మానసిక తృప్తిని పొందుతారని నేను బలంగా విశ్వసిస్తాను’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వైద్యవృత్తి అత్యంత పవిత్రమైన వృత్తి అన్న ఉపరాష్ట్రపతి, వృత్తి నిర్వహణలో చిత్తశుద్ధితోపాటు నైతికతను, విలువలను పాటించాలని యువ వైద్యులకు సూచించారు. విలువలను పాటించే విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదన్న ఆయన, కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో వైద్యవృత్తి మరిన్ని సవాళ్లతో కూడుకున్నదని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనాపై పోరాటంలో ముందు వరస పోరాటయోధులుగా పాటుపడాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

కార్యక్రమంలో భాగంగా విశిష్ట ప్రతిభను కనబరచిన విద్యార్థులకు పతకాలను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి, వారంతా అమ్మాయిలే కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు అవకాశం ఇస్తే, ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయనే దానికి ఇదో ఉదాహరణ అని, సోమవారం అందరికీ మహిళా దినోత్సవం కాగా, ఈఎస్ఐసీ వైద్య కళాశాల ఒక రోజు ముందే జరుపుకుందని తెలిపారు. కరోనా టీకాకరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా ముందుకు సాగుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ.. కరోనా కారణంగానెలకొన్న పరిస్థితులు మెల్లిమెల్లిగా సర్దుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కరోనా పూర్తిగా నిర్మూలించబడేంతవరకు ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వాన్ని వహించవద్దని దేశప్రజలకు ఉపరాష్ట్రపతి సూచించారు.

ప్రస్తుత కరోనా మహమ్మారి పట్టణాలతో పోల్చి చూస్తే, గ్రామాల్లో తన ప్రభావాన్ని చూపించలేకపోయిందని, దీనికి కారణం గ్రామీణ వాతావరణమే అని తెలిపారు. పట్టణాల్లో ఇళ్ళు మొదలుకుని, ఆఫీసుల వరకూ ప్రతి ఒక్కటీ అన్నివైపుల పూర్తిగా మూసి ఉంచిన కారణంగా గాలి, వెలుతురు, సహజమైన వాతావరణానికి దూరం అవుతున్నారని, ఈ పరిస్థితులో మార్పు రావాలని, ఈ దిశగా నిర్మాణ రంగ నిపుణులు దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల కేసులపై ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో 65శాతం మరణాలకు అసంక్రమిత వ్యాధులే కారణమన్న ఈ ఏడాది ఆర్థిక సర్వేను సైతం ఆయన ప్రస్తావించారు. పెరుగుతున్న ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు పట్టణ ప్రాంతాల్లో ఈఎస్ఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్లీనిక్‌లను ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. యువ వైద్యులు సమీపంలోని పాఠశాలలు, కళాశాలలు, సామాజిక కేంద్రాలను సందర్శించి, అసంక్రమిత వ్యాధుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. జీవనశైలిలో మార్పు, పౌష్టికాహార అవసరం తదితర అంశాలను వారికి అర్థమయ్యేలా తెలియజేయాలని తద్వారా అసంక్రమిత వ్యాధులకు వీలైనంత వరకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. దీంతోపాటు వైద్యులు-రోగుల నిష్పత్తి, సరైన సంఖ్యలో వైద్య కళాశాలలు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య వసతుల లేమి, ఆరోగ్య బీమా విషయంలో సరైన అవగాహన లేకపోవడం కారణంగా తలెత్తుతున్న అంశాలను కూడా ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీంతోపాటుగా వైద్య ఖర్చులు ఏటేటా పెరగడంపైనా ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు అందుబాటులో మంచి వైద్య వసతులను కల్పించే దిశగా భాగస్వామ్య పక్షాలన్నీ కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశంలోని 10శాతానికిపైగా జనాభాకు సరైన వైద్యవసతులు అందించేందుకు సామాజిక భద్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈఎస్ఐసీని ఉపరాష్ట్రపతి అభినందించారు. అయితే, సమస్యల పరిష్కారం, వైద్య వసతుల అభివృద్ధి తదితర అంశాల్లో మరింత పురోగతి జరిగేందుకు ఆస్కారం ఉందన్నారు. జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్ఏ)తో ఒప్పందం కుదుర్చుకుని, ఈఎస్ఐ పథకం లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్‌ జాబితా ఆసుపత్రుల్లో చికిత్సను అందించే విషయంపై నిర్ణయం తీసుకోవడంతోపాటు పలు ఇతర సంస్కరణల ద్వారా కార్మికులకు ఆరోగ్య భద్రత కోసం సంస్కరణలు తీసుకొస్తున్న కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా భారతదేశం సాధిస్తున్న ప్రగతిని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ దిశగా మరింత పురోగతి సాధించేందుకు యువ వైద్యులు మరింత కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్, కార్యదర్శి అపూర్వ చంద్ర, ఈ.ఎస్.ఐ.సి. డైరక్టర్ జనరల్ అనురాధ ప్రసాద్, డీన్ డాక్టర్ అసిమ్ దాస్ సహా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.