రాష్ట్రీయం

29 మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రణాళిక

హైదరాబాద్, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలో ఉన్న 29 మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి భవిష్యత్ అవసరాలను గుర్తించి, నివేధికలు సిద్దం చేయాలని అన్ని శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. అన్ని అంశాలపై సమగ్ర వివరాలు సేకరించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులతో పాటు సంబంధిత అధికారులతో నిర్వహించే సమావేశంలో చర్చించి, ఫీడ్ బ్యాక్ తీసుకొని తుది ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర అభివృద్ధిపై సంబంధిత విభాగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మౌలిక సదుపాయాలు, తాగునీరు, మురుగునీరు, రోడ్లు, డంపింగ్ యార్డులు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, ట్రాన్స్‌ఫార్మర్ల పరంగా విద్యుత్ పరిస్థితి, సబ్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు వంటి సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

అదే విధంగా నాలాలు, చెరువులు, ఉద్యానవనాల అభివృద్ధి, వైకుంఠదామాల నిర్మాణం, బస్తీ దవాఖానాలలో మౌళిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుకు అవసరమైన ప్రభుత్వ భూములను, భవనాలను గుర్తించాలని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నానాటికి పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలని సైబారాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లకు సూచించారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ యం.డి దాన కిషోర్, సి.డి.యం.ఎ సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి.అమయ్ కుమార్, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమా రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వి.సి.సజ్జనార్, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ ఈ టెలికాన్ఫరన్స్‌లో పాల్గొన్నారు.