ప్రకాశం జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతం

ఒంగోలు, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ మంగళవారం ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. చీమకుర్తి మండలం కూనంనేనివారిపాలెం 10వ వార్డులో ఓటు వేసేందుకు కర్రకోతకు వచ్చిన వారు రాగా వైకాపా మద్దతుదారులు అడ్డుకున్నారు. దాంతో తెదేపా వారు నిలదీయగా ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. వెంటనే పోలీసులు కట్టడి చేశారు. ఇలాంటి ఒకటి రెండు చెదురుమదురు ఘటనలు మినహా ఈ ప్రక్రియ సజావుగా ముగియటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా పోలీసు కేంద్రంలోని కమాండ్‌ కంట్రోల్‌ నుంచి వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను వీక్షించిన ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తమ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, ఎన్నికల సెల్‌లో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 20 మంది సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు

చేశారు. జిల్లా నలుమూలల నుంచి వస్తున్న సమాచారాన్ని తెలుసుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. తొలి దశ ఎన్నికలు జరిగిన 14 మండలాల అధికారులతోపాటు ఒంగోలు డీఎస్పీ, ట్రాఫిక్‌ డీఎస్పీ, దిశ మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ, కందుకూరు డీఎస్పీలతో ఎస్పీ వైర్‌లెస్‌ సెట్ల ద్వారా మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. తీవ్ర సమస్యాత్మక గ్రామాల్లో సిబ్బందికి ఏర్పాటు చేసిన బాడీ వార్న్‌ కెమెరాల ద్వారా అక్కడి పరిస్థితుల్ని కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో బారీ తెరలపై వీక్షించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 7,800 సీసీ కెమెరాల ద్వారా అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు.

డయల్‌-100కు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 81 రూట్‌ మొబైల్‌ పార్టీలు, 60 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ పార్టీలను ఏర్పాటు చేసి అవాంఛనీయ చర్యలను నిలువరించారు. ఎన్నికలు జరిగిన ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించి మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి, అదనపు ఎస్పీ బి.రవిచంద్ర, ఏఆర్‌ అదనపు ఎస్పీ టి.శివారెడ్డిలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. 13 మంది డీఎస్పీలు, 33 మంది సీఐలు, 110 మంది ఎస్సైలు, 1964 మంది సిబ్బంది, ఏపీఎస్పీ నుంచి నాలుగు ప్లటూన్ల బలగాలతోపాటు 2,642 మంది పారా పోలీసు సిబ్బంది పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగటానికి విధులు నిర్వర్తించారు. సమస్మాత్మక గ్రామాలైన కొత్తపట్నం, ఈతముక్కల, టంగుటూరు పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. టంగుటూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా జేసీ చేతన్, శిక్షణ కలెక్టర్‌ అభిషేక్‌ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Latest News