ప్రాంతీయం

బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత

ఒంగోలు, ఏప్రిల్ 3 (న్యూస్‌టైమ్): పిల్లల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాల అమలు, ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. గుంటూరు రోడ్డులోని ఎ1 కన్వెన్షన్ హాల్‌లో మహిళా పోలీసుల అవగాహన సదస్సు ఏర్పాట్లపై ఆయన శనివారం ఉదయం జిల్లా అధి కారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సులువుగా సత్వరమే న్యాయం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం మహిళా పోలీసులకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ప్రజలకు చేరువగా వున్న సచివాలయాలలోని మహిళా పోలీసుల ద్వారా కుటుంబాలను, పిల్లలను రక్షించుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్తంగా మహిళా పోలీసులకు చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు చేసినప్పటికీ ప్రజలలో అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు.

న్యాయం ఎలా పొందాలి, ఎవరిని సంప్రదించలి అనే విషయాలు తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. మహిళలు న్యాయం పొందలేకపోతున్నారని, వారికి విజ్ఞానం అందించే దిశగా మహిళా పోలీసులకు చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సదస్సు మహిళలకు ప్రయోజనకరంగా మారుతుందని వివరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చొరవతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆసక్తిని ఏకం చేస్తూ సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మహిళలు, పిల్లల హక్కులపై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలు కలిసి నిర్ణయం తీసుకున్నాయని కలెక్టర్ చెప్పారు. ఏప్రిల్ మాసం నుండి వచ్చే 2022 మార్చి వరకు ప్రణాళికలు రూపొందించి మహిళలు, పిల్లలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సంవత్సరం రోజులు జరిగే కార్యక్రమాలతో ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో సదస్సు ద్వారా తెలియజేస్తామన్నారు.

జాతీయ న్యాయ సేవాధి కార సంస్థ ద్వారా చైతన్య కార్యక్రమాలకు నాందీ ప్రస్థానమని కలెక్టర్ అభివర్ణించారు. వికేంద్రీకరణ పద్దతిలో ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మహిళలు, బాలలకు ఉన్న హక్కులు, చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. ఇదంతా జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు వెళ్లాల్సివుందని కలెక్టర్ చెప్పారు. ఈ ఎ1 కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 5వ తేదీన భారీ స్థాయిలో మహిళా పోలీసులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా మహిళలు, పిల్లల హక్కులపై నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సదస్సులో హైకోర్ట్ నుంచి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ హైకోర్ట్ ఆఫ్ ఏ.పి. మఠం వెంకట రమణ, సత్యార్థి ఫౌండేషన్ తరపున అతిథిగా ధనుంజయ్, ప్రజ్వల ఫౌండేషన్ సునీత కృష్ణన్, తదితరులు తమ ఉపన్యాసాన్ని అందిస్తారని కలెక్టర్ వివరించారు.

ఈ అవగాహన సదస్సులో మహిళలు, పిల్లల రక్షణపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ, పోలీస్ శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో సదస్సుకు హాజరయ్యే వారంతా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి అధికారులకు సూచించారు. జిల్లాలోని మహిళలను చైతన్య పరచడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపకరిస్తుందని జిల్లా ఎస్.పి. సిద్ధార్డ్ కౌశల్ చెప్పారు. భారీ స్థాయిలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో మహిళా పోలీసులు విధిగా హాజరుకావాలని ఆయన తెలిపారు. సదస్సు ద్వారా సామాజిక చైతన్యానికి మహిళా పోలీసులు నడుంబిగించాలని ఆయన సూచించారు.

సదస్సును సద్వినియోగం చేసుకోవాలని సత్ఫలితాల సాధనకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఆయనవెంట జాయింట్ కలెక్టర్ కె.కృష్ణ వేణి (ఆసరా, సంక్షేమం), మార్కాపురం ఓ.ఎస్.డి. చౌడేశ్వరి, డి.ఆర్..ఓ. కె.వినాయకం, ఒంగోలు ఆర్.డి.ఓ. ప్రభాకర రెడ్డి, డి.ఆర్.డి.ఎ., డ్వా మా పి.డి.లు బాబూరావు, సినారెడ్డి, డి.పి.ఓ. నారాయణ రెడ్డి, స్టెప్ సి.ఇ.ఓ. పి.వి.నారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ కె.భాగ్యలక్ష్మి, పశుసంవర్థక శాఖ జె.డి. బేబి రాణి, ఐ.సి.డి.ఎస్. పి.డి. లక్ష్మీ దేవి, ఎన్.ఐ.సి. అధికారి వెంకటసుబ్బయ్య, సమాచార శాఖ డి.ఇ. గ్రేస్ లినోరా, డి.ఇ.ఓ. సుబ్బారావు, మహిళ అభ్యుదయ నాయకురాలు టి.అరుణ, తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.