తెలంగాణ

విరమణ ఉద్యోగానికే…

హైదరాబాద్, జనవరి 30 (న్యూస్‌టైమ్): బీఆర్‌కేఆర్ భవన్‌లో ఇవాళ సచివాలయంలోని ఉద్యోగుల కోసం పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరినీ గౌరవంగా, సముచితరీతిలో చూడాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెబుతుంటారని, ఆయనకు ఉద్యోగుల పట్ల ఉన్న సదాభిప్రాయం అలాందిదన్నారు. బీఆర్‌కేఆర్ భవన్‌లోని వివిధ విభాగాల్లో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు.

ఆయా శాఖలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కార్యదర్శులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ విధులకు మాత్రమే విరమణ ఉంటుందని, ఉద్యోగి అన్ని వేళలా ప్రభుత్వానికి సేవకుడేనని పేర్కొన్నారు. నేడు పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ వాహనాలలో వారి వారి ఇళ్ల వద్ద విడిచిపెట్టాలని సీఎస్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కోసం పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్‌ను కూడా సిద్ధం చేయాలని ఆయన సూచించారు.