ప్రాంతీయం

ప్రాదేశిక ఎన్నికలపై ప్రకాశంలో సమీక్ష

ఒంగోలు, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి భద్రత కోసం జిల్లాలో 20 స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ సూచించారు. ఎన్నికల నిర్వహణపై నియమితులైన ప్రత్యేక అధికారులతో సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని వీడియో సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు. ప్రాదేశిక ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కోసం 1285 టేబుళ్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బ్యాలెట్ పత్రాలు ముద్రణకు సిద్ధంగా ఉంచామన్నారు.

ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు ఆయా మండలాలకు చేర్చామన్నారు. మండలాలలో స్క్వాడ్ టీమ్‌లు, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీములు సమర్థంగా పనిచేయాలన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రత్యేక అధికారులు చురుకైన పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి సమీపంలోనే స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్‌కు ద్వితీయ శ్రేణి అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి పనిచేయాలని ఆయన పలు సూచనలు చేశారు.

ఈ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఈ నెల 7వ తేదీన రెండవ విడత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు పీఓలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. వెబ్ క్యాస్టింగ్ టీమ్‌లు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా నిఘా ఉంచాలన్నారు. ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను పంచాయితీ రాజ్ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆదేశించారు. తొలుత అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. వెబ్ క్యాస్టింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. ఎన్నికల మార్గదర్శకాలను తప్పినిసరిగా పాటించాలన్నారు.

బ్యాలెట్ పత్రాల ముద్రణలో పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోసం అవసరమైన సామగ్రి కొనుగోలు చేసుకోవాలని ఆయన చెప్పారు. జిల్లాలో ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) టి.ఎస్. చేతన్ రాష్ట్ర కమిషనర్‌కు వివరించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సమీపంలోనే ఓట్ల లెక్కింపు కేంద్రాలను గుర్తించామని ఆయన దృష్టికి లెచ్చారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్‌బి అండ్ ఆర్) జె.వెంకట మురళి, డి.ఆర్.ఓ. కె.వినాయకం, కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ తేజ, జడ్పీ సి.ఇ.ఓ. కైలాష్ గిరీశ్వర్, ఒంగోలు, మార్కాపురం ఆర్.డి.ఓ.లు ప్రభాకర రెడ్డి, శేషి రెడ్డి, బి.సి. కార్పొరేషన్ ఇ.డి. ఎం.వెంకటేశ్వరరావు, డి.పి.ఓ. నారాయణ రెడ్డి, సి.పి.ఓ. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.