జాతీయం

న‌కిలీ సంస్థ‌ల ద్వారా రూ.376 కోట్ల ఇన్‌పుట్ టాక్స్ స్వాహా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (న్యూస్‌టైమ్): సిగిరెట్లు ఎగుమ‌తి చేసిన‌ట్టు చూపుతూ న‌కిలీ, డ‌మ్మీ, ప‌ని చేయ‌ని ‌సంస్థ‌ల ద్వారా కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్న‌ట్టుగా ఐజీఎస్‌టీ రీఫండ్ ప‌ద్ధ‌తి ద్వారా అక్ర‌మంగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని పొందార‌న్న ఆరోప‌ణ‌ల‌తో హ‌ర్యానా, బ‌హ‌దూర్‌గ‌ఢ్‌కు చెందిన రితేష్ అగ‌ర్వాల్‌ను డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ జిఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), గురుగ్రాం జోన‌ల్ యూనిట్ అరెస్టు చేసింది. ఎం/ఎస్ఎస్ఆర్ ఇంపెక్స్ ప్రొప‌రైట‌ర్ అయిన రితేష్ అగర్వాల్ ఎం/ఎస్ఎస్ఆర్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే మ‌రొక సంస్థ‌కు వాస్త‌వ య‌జ‌మాని అనే విష‌యం ద‌ర్యాప్తులో బ‌యిట‌ప‌డింది. ఈ సంస్థ స‌ర‌ఫ‌రా లంకెలో ఆరు డ‌మ్మీ సంస్థ‌లు-ఎం/ఎస్ జోల్స్ ట్రేడింగ్ కో, ఎఎస్ ట్రేడ‌ర్స్‌, ఎఆర్ ట్రేడ‌ర్స్‌, ఓం ట్రేడ‌ర్స్, కాపిట‌ల్ ఇండియా & ఎస్ఎం ఇంట‌ర్‌ప్రైజెస్ రితేష్ అగ‌ర్వాల్ నియంత్ర‌ణ‌లో ఉన్నాయ‌ని వెల్ల‌డైంది. ఈ సంస్థ‌ల‌న్నింటిలోనూ రితేష్ అగ‌ర్వాల్ స‌రుకులేకుండా బిల్లింగ్ ద్వారా రూ. 376 కోట్ల ఐటిసిని పొందారు. శాఖ రితేష్ అగ‌ర్వాల్‌కు రూ.37.13 కోట్ల‌ను రిఫండ్‌ను మంజూరు చేసింది.

ఇందుకు అద‌నంగా, రితేష్ అగ‌ర్వాల్ పాత నేర‌గాడు అనే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇంత‌కుముందు కేసులో న‌కిలీ సంస్థ ఎం/ఎస్ఎస్ఎస్ అండ్ కో ద్వారా ఇదే ప‌ద్ధ‌తిలో న‌కిలీ ఐటిసీని పొందిన రూ. 26.53 కోట్ల వ్య‌వ‌హారంలో షోకాజ్ నోటీసును జారీ చేశారు. అంతేకాకుండా, ర‌విగుప్తా అనే మారుపేరు క‌లిగిన రితేష్ అగ‌ర్వాల్‌, వ‌క్క‌ల దిగుమ‌తిలో స్థానిక ధృవ‌ప‌త్రాన్ని ఫోర్జ‌రీ చేసి మోస‌పూరితంగా డ్రాబ్యాక్‌ను పొందినందుకు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఆయ‌న‌కు డీజీఆర్ఐ 2019 మార్చి 1న షోకాజ్ నోటీసును జారీ చేసింది. ద‌ర్యాప్తు ఢిల్లీ, హ‌ర్యానాల‌లోని బ‌హుళ ప్ర‌దేశాల‌లో నిర్వ‌హించ‌డ‌మేకాక‌, ఈ సంస్థ‌లకు స‌ర‌ఫ‌రా చేసే అనేక‌మంది స‌ప్ల‌య‌ర్ల స్టేట్మెంట్లు, ప‌త్రాల‌తో కూడిన సాక్ష్యాల ఆధారంగా, రితేష్ అగ‌ర్వాల్ న‌కిలీ/ఉనికిలో లేని/డ‌మ్మీ సంస్థ‌ల రాకెటింగ్‌ను నిర్వ‌హించ‌డంలో, మోస‌పూరితంగా రూ. 376 కోట్ల ఐటీసీని పొంద‌డంలో రితేష్ అగ‌ర్వాల్ కీల‌క‌పాత్ర పోషించార‌ని ఖ‌రారు చేశారు. ఈ క్ర‌మంలో రితేష్ అగ‌ర్వాల్‌ను అరెస్టు చేసి, ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్ట్ డ్యూటీ ఎంఎం ఎదుట హాజ‌రుప‌ర‌చ‌గా ఆయ‌న జ్యుడిష‌య‌ల్ క‌స్ట‌డీని విధించారు. ఈ విష‌యంలో త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.