రాజకీయం

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గూండాగిరి

విజయవాడ, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): టీడీపీ జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో టీడీపీ యదేశ్ఛగా గూండాగిరి చేస్తోందని, వీరిపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అనేక చోట్ల అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చిత్తూరులో టీడీపీ శాసనసభ్యులు రౌడీలు, గూండాలను వెంట పెట్టుకొని వైయస్‌ఆర్‌ సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను వాహనాలతో తొక్కించిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడు ప్రలోభాలకు దిగుతున్నాడని, అందుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు సైతం బయటకువచ్చాయన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ బలపర్చిన అభ్యర్థిని సర్పంచ్‌ నామినేషన్‌ వేయకుండా అడ్డుకొని గందరగోళం సృష్టించాడని మండిపడ్డారు. నిమ్మాడలో అరాచకానికి పాల్పడిన హరిప్రసాద్, సురేష్‌ అనే వ్యక్తులను అరెస్టు చేయాలని, సురేష్‌ అనే వ్యక్తి సర్పంచ్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలను నిస్పక్షపాతంగా జరిపేందుకు ఎస్‌ఈసీ ముందుకురావాలని ఎస్‌ఈసీకి వినతిపత్రం అందించామని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. పార్టీల ప్రమేయం ఉండకూడదని, ఎక్కడా ధనం, మద్యం, ప్రలోభాలు ఉండకూడదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చట్టంలో సవరణ చేశారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ముందుకుసాగుతుందన్నారు. కానీ, చంద్రబాబు మాత్రమే దాడులు ప్రోత్సహిస్తూ పల్లెల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.