స్థానికం

విశాఖ ఉక్కుపై కేంద్రం నిర్ణయం దురదృష్టకరం

విశాఖపట్నం, ఫిబ్రవరి 8 (న్యూస్‌టైమ్): విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) అన్నారు. ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తుందని, ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ధ్వజమెత్తారు.

కేంద్ర నిర్ణయంపై పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు స్పందించాలన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆపాలని, ఆయనకు ధైర్యం ఉంటే మోదీకి లేఖ రాయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ నేతలు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారని, ఉత్తుత్తి రాజీనామాలతో ఒరిగేది ఏమీలేదని మండిపడ్డారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎలాంటి పోరాటానికైన సిద్ధమని అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.