‘మహిళల పట్ల ఆలోచన ధోరణి మారాలి’
ఒంగోలు, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): మహిళల పట్ల సమాజ ఆలోచన ధోరణి మారినప్పుడే వారిపై నేరాలు తగ్గుతాయని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి అన్నారు. దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్లడానికి మహిళలకు భద్రత, స్వేచ్చ ఎంతో అవసరమని చెప్పారు. మహిళలు, పిల్లలకు అవసరమైన న్యాయ సేవలు అందించడానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎస్ఎస్ఏ), జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులోని ఏ1 కన్వెన్షన్ హాలులో మహిళా సంరక్షణ కార్యకర్తలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జస్టిస్ బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం చట్టాలు, పోలీసుల ద్వారానే మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గవన్నారు.
మహిళల పట్ల పురుషులలో గౌరవ పూర్వకమైన ఆలోచన ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని చెప్పారు. చిన్నారులు, మహిళల వెట్టి చాకిరీ, అక్రమ రవాణా, లైంగిక దాడుల కేసులలో 97-98 శాతం వరకూ బంధువులు, తెలిసిన వారే నిందితులుగా ఉంటున్నారని జస్టిస్ బాగ్చో అన్నారు. బాలికలు, మహిళల్లో రక్తహీనతకు వారికి అందించే ఆహారం విషయంలోనూ పురుషులతో చూపుతున్న వివక్ష కూడా కారణంగా ఉందన్నారు. ఇప్పటికీ ఇలా అన్ని విషయాల్లోనూ మహిళ తన గౌరవాన్ని కోల్పోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. లింగ వివక్షకు పాల్పడుతున్న ఈ విషయాల్లో ముందుగా సమాజం తనకు తానుగా పరిశీలన చేసుకుని ఆలోచన ధోరణిని మార్చుకోవాలని ఆయన సూచించారు. పలు ప్రాంతాల్లోని నేరగాళ్లు ఏకమై పాల్పడుతున్న మహిళల అక్రమ రవాణా, సైబర్ క్రైమ్ వంటి వ్యవస్తీకృత నేరాలను అరికట్టడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అవసరమని జస్టిస్ బాగ్చి అభిప్రాయపడ్డారు.
బాధితులకు కేవలం ఆర్ధికపరమైన సహాయమే కాకుండా వారిలో మనోధైర్యం నింపి స్వయం ఉపాధి పొందేలా అవసరమైన శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. నేరాలను అరికట్టడంలోనూ, బాధితులకు న్యాయపరమైన సహాయం అందించడంలోనూ పారా లీగల్ వాలంటీర్లు తమ వంతు పాత్ర పోషించాలని ఆయన అన్నారు. పలు రూపాల్లో ఉన్న నేరాలు, ఎదురవుతున్న సమస్యలపై ఉమ్మడి పోరాటం అవసరమని, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కూడా ఈ విషయంపై మరింత దృష్టి పెడుతుందని జస్టిస్ బాగ్చి చెప్పారు. గౌరవ అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఎం. వెంకట రమణ మాట్లాడుతూ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకున్న వారిని రక్షించి, బాధితులకు సహాయం చేయడం కంటే అసలు మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బాధ్యత సమాజంలోని అందరిపైనా ఉందన్నారు.
ఈ విషయంలో మహిళా సంరక్షణ కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఆయన సూచించారు. నేరప్రవర్తనగల వారిని ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. బాల కార్మిక విధానాన్ని అడ్డుకోవడంపైనా దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. అయితే అధికార దర్పంతో కాకుండా మానవీయ కోణంలో వ్యవహరించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు. హైదరాబాదుకు చెందిన ప్రజ్వల స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ మాట్లాడుతూ నేడు దేశంలో ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ అక్రమ తరలింపునకు గురవుతోందన్నారు. అనంతరం వీరిని వెట్టిచాకిరి, వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో 45 శాతం వరకూ బాలికలే బాధితులుగా ఉంటున్నారని ఆమె వివరించారు. ఇలాంటి నేరగాళ్ల నుంచి ఇప్పటికీ కేవలం 3 శాతం బాధితులను మాత్రమే కాపాడగలుగుతున్నామని సునీత తెలిపారు.
ఈ నేరగాళ్ల బారి నుంచి మహిళలు, చిన్నారులను కాపాడడానికి సమాజంలోని అందరూ బాధ్యతగా, సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువలో ఉండే మహిళా సంరక్షణ కార్యకర్తలు ఈ విషయంలో మహిళా సంరక్షణ యోధులుగా నిలిచి పని చేయాలని ఆమె సూచించారు. ఢిల్లీకి చెందిన బచ్చన్ బచావో ఆందోళన్ (బేబీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనుంజయ్ తింగాల్ మాట్లాడుతూ బాధిత మహిళలకు అండగా ఉన్న పథకాల గురించి మహిళా సంరక్షణ కార్యకర్తలు సమాజంలో అవగాహన కలిగించాలని అన్నారు. అధికారులు కూడా వెంటనే స్పందించి బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర డీఐజీ (టెక్నికల్) పాల్ రాజ్ మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దిశా అప్లికేషన్‌ను 13 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవలు కూడా ఇందులో చేర్చితే వినియోగదారులకు మరింత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్నాయని చెప్పారు. బాధితుల్లో 67 శాతం మంది పట్టణవాసులేనని, చదువుకున్న వారై ఉండి కూడా బాధితులుగా మారుతున్నారని తెలిపారు. స్మార్ట్, ఇన్నోవేటివ్ పోలీసింగ్‌లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నా వాటి ఫలితాలు ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే సైబర్ మిత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా వాట్సాప్‌లో ఇంటి నుంచే ఫిర్యాదు చేసే అవకాశం లభించిందన్నారు. ఈ ఫిర్యాదుల్లోనూ 50 శాతం వరకూ సైబర్ సంబంధ కేసులు ఉంటున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారికి రక్షణ కల్పించడం కూడా ఎంతో ముఖ్యమన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రెండేళ్లుగా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి పని చేస్తోందని చెప్పారు.
మహిళలు, చిన్నారులకు అండగా ఉన్న పథకాలపై మహిళా సంరక్షణ కార్యకర్తలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ సాంకేతిక టెక్నాలజీ సాయంతో మహిళలకు మరింత భద్రత కల్పించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. అభయ యాప్, స్పందన కార్యక్రమాల ద్వారా బాధితులు నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. పంచాయతీ స్థాయిలో ప్రజలకు చేరువలో ఉండే మహిళా పోలీసులకు మరింత అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దిశ యాప్ ద్వారా కూడా స్వల్పకాలంలోనే మంచి ఫలితాలు సాధించామన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించడం ద్వారా మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టవచ్చని చెప్పారు.
రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ మహిళలకు, చిన్నారులకు ఉపయోగకరంగా ఉన్న పథకాలను వారికి చేరువ చేయడమే న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమని చెప్పారు. ఈ దిశగా 10 అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జ్యోతిర్మయి మాట్లాడుతూ సమస్య ఏదైనా జిల్లా న్యాయసేవాధికార సంస్థకు రావాలని చెప్పారు బాధితులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అందరికీ న్యాయం చేరువలో ఉంచడమే న్యాయ సేవాధికార సంస్థ కర్తవ్యమని వివరించారు. నల్సా ద్వారా అందే సేవలకు సంబంధించి తెలుగులో రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా వక్తలు ఆవిష్కరించారు. నల్సా సేవలపై తెలుగులో రూపొందించిన ఈ పాటను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.
ఇకనుంచి ప్రతి సినిమా హాల్లో సినిమా ప్రారంభానికి ముందుగా ఈ పాటను ప్రదర్శిస్తామని జ్యోతిర్మయి తెలిపారు. అనంతరం మహిళా సంరక్షణ కార్యకర్తలు యామిని, షహీనా, సంగీత, మెప్మా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భారతి క్షేత్రస్థాయిలో తాము గుర్తించిన సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కె.కృష్ణవేణి, ఐసిడిఎస్ పిడి లక్ష్మీదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సాయంత్రం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ చేపట్టిన పలు కార్యక్రమాలకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టీస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టీస్ ఎం.వెంకట రమణ తిలకించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి వెంట రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి చిన్నం శెట్టి రాజు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర జడ్జీలు ఉన్నారు.