జాతీయం

అత్యవసర వైద్య సేవలకు వృత్తి నైపుణ్య శిక్షణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): అత్యవసర సమయాలలో వైద్యం అందించే అంశంలో నైపుణ్యాలను పెంపొందించడానికి దేశంలో అమలులో వున్న అత్యవసర వైద్య సేవల మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమం కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 140 నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పడానికి గల అవకాశాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిశీలిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఉత్తరప్రదేశ్‌లో 17 నైపుణ్య కేంద్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించారు. వీటిలో 11 కేంద్రాలను నెలకొల్పడానికి సంబంధించిన ప్రతిపాదనలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఇంతవరకు అందాయి.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దీనికి అవసరమైన నిధులను పూర్తిగా కేంద్రప్రభుత్వం అందజేస్తుంది. ఒకో వృత్తి నైపుణ్య కేంద్రాన్ని నెలకొల్పడానికి (ప్రదేశం బట్టి) 2.60 కోట్ల రూపాయల నుంచి 2.90 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే సిఫార్సుల ఆధారంగా ఈ నిధులను మౌలిక సదుపాయాలను కల్పించి పరికరాలను కొనుగోలు చేయడానికి వైద్య కళాశాలలు, సంస్థలకు విడుదల చేయడం జరుగుతుంది. ఇంతవరకు 82 వైద్య కళాశాలలకు 121 కోట్ల రూపాయల మేరకు నిధులను విడుదల చేయడం జరిగింది.