రాష్ట్రీయం

మూడో ద‌శ‌లోనూ పోటెత్తిన ఓట‌ర్లు

అమరావతి, ఫిబ్రవరి 17 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహించారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్‌ కేంద్రాలలో మూడో విడత పోలింగ్ జ‌రిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది.

ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. పంచాయితీ ఎన్నికల్లో ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెన్నలపాలంలో అరకు వైయ‌స్సార్‌సీపీ ఎంపీ గొట్టేటి మాధవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. ఉదయం 10:30 వరకు 40.29 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.