అమరావతి,కోస్తాటైమ్స్: రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగించాలని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. లాక్‌డౌన్ సడలించడం లేదా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ఓవైపు రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కన్నా గుర్తు చేశారు. ఇప్పటికే చాలా దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మనదేశం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయాన్ని అభినందించాయన్నారు. ప్రజల జీవన స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థను క్రమ బద్దీకరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ…ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యమని లేఖలో పేర్కొన్నారు. ఒడిశా లాంటి రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్న విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ పరిస్థితిని ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని, ఎలాంటి సడలింపులు వద్దని కన్నా విజ్ఞప్తి చేశారు.