విజయవాడ: ఏపీలో ప్రతి జిల్లాలోనూ ఒక డిగ్రీ కాలేజీని మోడల్ గా కళాశాలగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాకుండా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ కు (ఎస్ఎఆర్ఎఫ్) పైలెట్ ప్రాజెక్టుగా ఆ 13 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలనే (జీడీసీ) ఎంపిక చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం రూ.40.62 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదాన్ని తెలిపింది. శ్రీకాకుళంలోని జీడీసీ (ఎం), విజయనగరం జిల్లా సాలూరులోని జీడీసీ,
విశాఖలో డాక్టర్ వీఎస్ కృష్ణా జీడీసీ, రాజమహేంద్ర వరంలోని ప్రభుత్వ కాలేజీ (ఏ), పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఎసీఐఎం, కృష్ణాజిల్లా విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ, గుంటూరులో మహిళా డిగ్రీ కాలేజీ, ఒంగోలులో మహిళా డిగ్రీ కాలేజీ, నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీ, అనంతపురంలో పురుషుల డిగ్రీ కాలేజీ, చిత్తూరులో పీవీకేఎన్, కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కడపలోని పురుషుల డిగ్రీ కాలేజీని ఎఆర్ఎఫ్ పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు.