న్యూఢిల్లీ, జనవరి 21 (న్యూస్‌టైమ్): ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) ఆధ్వర్యంలోని కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ (సిఎస్‌ఎంసి) 52వ సమావేశంలో 1,68,606 కొత్త గృహాల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ సమావేశంలో 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నాయి. ఈ గృహాలను లబ్ధిదారుల లెడ్ కన్స్ట్రక్షన్, భాగస్వామ్యంతో ఇన్ సిటు మురికివాడల పునరాభివృద్ధి ప్రాతిపదికన నిర్మించాలని ప్రతిపాదించారు. స్థలం, స్థలాకృతి, అంతర్ నగర వలసలు, నిలువు వరుసల ప్రాధాన్యతలను మార్చడం వంటి వివిధ సమస్యల కారణంగా ప్రాజెక్ట్ మార్గదర్శకాలు పునర్ నిర్వచించాలని రాష్ట్రాలు తమ ప్రతిపాదనలను ఉంచాయి. 70 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 41 లక్షల ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, పిఎంఎవై (యు) ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడానికి వ్యూహరచన చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. ‘‘పథకం పురోగతి స్థిరంగా ఉంది. మనం ప్రాథమిక భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలతో ఇళ్ళు పూర్తి చేసే దిశగా పయనించాలి’’ అని చెప్పారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు లబ్ధిదారులకు ఇళ్ళు పూర్తి చేయడం, పంపిణీ చేయడంపై దృష్టి పెట్టాలని, అఫడబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ (ఎఆర్‌హెచ్‌సి) పథకం అమలు వేగవంతం చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు. అగర్తాలా (త్రిపుర), రాంచీ (జార్ఖండ్), లక్నో (ఉత్తర ప్రదేశ్), ఇండోర్ (మధ్యప్రదేశ్), రాజ్‌కోట్ (గుజరాత్) చెన్నై (తమిళనాడు) నగరాల్లోని లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ (ఎల్ హెచ్పీ)ని మాస్ హౌసింగ్ కోసం దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని ఆయన సూచించారు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఇది రెండవ సీఎస్ఎంసీ సమావేశం. 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో 2022 నాటికి పట్టణ ప్రాంతంలో అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ పక్కా ఇళ్లను అందించడానికి గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. అందులో భాగంగా పిఎమ్‌ఎవై (యు) కింద ‘అందరికీ హౌసింగ్’ అనే లక్ష్యంతో నిర్ణీత సమయం లోపు దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం, పంపిణీపై దృష్టి సారించింది.