అమరావతి, జనవరి 24 (న్యూస్‌టైమ్): ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ బాధ్యత అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏకపక్షంగా అందరిని బెదిరించే ధోరణిలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. కానీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అందరినీ బెదిరించే ధోరణీలో నిమ్మగడ్డ వ్యవహార శైలి ఉందన్నారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తాను చెప్పాల్సింది చెప్పి మీడియాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం ఆయన నియంతృత్వ ధోరణీకి నిదర్శనమన్నారు. ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. ఉద్యోగ సంఘాల అభ్యర్థన, వ్యాక్సినేషన్ ప్రిక్రియ పట్టించుకోకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సరైంది కాదన్నారు. మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడంలో ఆంతర్యం ఏంటని మల్లాది విష్ణు ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు.