ఏపీలో పంచాయతీ ఎన్నికల రీ షెడ్యూల్..
న్యూఢిల్లీ, అమరావతి, జనవరి 25 (న్యూస్‌టైమ్): ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహత్గి కోర్టుకు విన్నవించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనిపై వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కీలక ఆదేశాలిచ్చారు. పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మెదటి దశను నాలుగో దశగా, రెండో దశ ఎన్నికలను మొదటి దశకు మార్చారు. అలాగే మూడో దశను రెండో దశకు మార్చారు. నాలుగో దశను మూడో దశకు మార్చిన ఎస్ఈసీ మొదటి దశను నాలుగో దశకు రీషెడ్యూల్ చేశారు. రీ షెడ్యూల్ చేసిన ప్రకారం మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈనెల 29కి వాయిదా వేశారు. నిమ్మగడ్డ ప్రకటించిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కాకపోవడమే రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. రీ షెడ్యూల్ వివరాలను నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లా కలెక్టర్లకు పంపించారు. దీనిపై జిల్లా అధికారులతో కాసేపట్లో సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన వెంటనే యాక్షన్ ప్లాన్‌లోకి దిగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌పై దృష్టి పెట్టిన ఆయన సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూశారు. అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించిన వెంటనే రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సిబ్బందికి ఎన్నికల కేటాయింపుకు సమయం ఇవ్వడంతో పాటు అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురుచూసిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను సిబ్బందికి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఉదయం నుంచి ఎన్నికల విధుల్లో అధికారులు పాల్గనకపోవడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని ఏఫీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాల తీరుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిక్ రిషికేష్ రాయ్ నేతృత్వంలోని బెంచ్ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాలన్న ధర్మాసనం వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అలాగే కేరళలో ఎన్నికల వల్లే కరోనా వ్యాప్తి చెందిందని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. అలాగే ఉద్యోగ సంఘాల వాదనలు వినడానికే ఆసక్తి చూపని కోర్టు వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.