గుంటూరు, జనవరి 25 (న్యూస్టైమ్): ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల తర్వాత పక్షవాతానికి గురైన బొక్కా విజయలక్ష్మి(45) అనే ఆశా వర్కర్ నిన్న ఉదయం ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని ఆమె ఇంటికి ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆళ్ల నాని, సుచరిత వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
రేపటిలోగా వారి కుటుంబానికి ఈ పరిహారం అందుతుందని మంత్రులు చెప్పారు. అలాగే, వారికి ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి ఆళ్ల నాని అన్నారు. అయితే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వల్ల ఎవ్వరూ మరణించలేదని మంత్రి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలను గుర్తించలేదని తెలిపారు. వ్యాక్సిన్ వేసే ప్రక్రియ సురక్షితంగా కొనసాగుతుందని చెప్పారు. విజయలక్ష్మి పోస్టు మార్టం నివేదిక తమకు అందగానే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.