న్యూఢిల్లీ, జనవరి 25 (న్యూస్టైమ్): ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పిఎమ్ఆర్బిపి) గ్రహీతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంలో మహిళలు, బాలల వికాసం శాఖ కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ కూడా హాజరయ్యారు. ఈ సంవత్సరం పురస్కారాలను గ్రహీతలు కరోనా తాలూకు కష్టకాలంలో గెలుచుకొన్నందువల్ల ఈ పురస్కారాలు వారికి ప్రత్యకమైనవి అని ప్రధాన మంత్రి అన్నారు.
పురస్కార స్వీకర్తలతో ప్రధాన మంత్రి ముచ్చటించిన క్రమంలో, ప్రధానంగా నడవడికలో మార్పును ఉద్దేశించిన ‘స్వచ్ఛత అభియాన్’ వంటి ప్రచార ఉద్యమాలలో బాలల పాత్ర ఎంతైనా ఉందని ఆయన అంగీకరించారు. కరోనా కాలంలో చేతులను సబ్బుతో, నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి అని చాటిచెప్పే ప్రచార కార్యక్రమాలలో బాలలు పాలుపంచుకొన్నప్పుడు, ఆ ప్రచార ఉద్యమాలు ప్రజల మనస్సులలో నాటుకుపోయి సఫలతను సాధించాయి అని ఆయన అన్నారు. ఈ సంవత్సరంలో పురస్కారాలను ప్రదానం చేసిన రంగాల తాలూకు వైవిధ్యాన్ని సైతం ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
ఒక చిన్న ఆలోచనకు సరైన పని తోడయితే ఫలితాలు ఆకర్షణీయంగా ఉంటాయి అని ప్రధాన మంత్రి అన్నారు. క్రియాశీలత పట్ల బాలలు నమ్మకాన్ని పెంచుకోవాలని, ఈ ఆలోచనలకు, కార్యాలకు మధ్య ఉన్న సంబంధం గొప్ప గొప్ప పనులను చేయడానికి ప్రజలకు ప్రేరణను అందిస్తాయని ఆయన చెప్పారు. సాధించిన విజయాలతోనే బాలలు సంతృప్తి పడిపోకూడదు, వారు వారి జీవితాలలో మరింత ఉత్తమమైన ఫలితాల కోసం కృషి చేస్తూనే ఉండాలి అని ప్రధాన మంత్రి సూచించారు.
బాలలు మూడు అంశాలకు, మూడు ప్రతిజ్ఞలకు వారి మనస్సులో స్థానం ఇవ్వాలి అని ప్రధాన మంత్రి కోరారు. ఒకటో అంశం- నిలకడతనం తాలూకు ప్రతిజ్ఞ; చేసే పనులలో వేగం ఎంత మాత్రం తగ్గకూడదు అని ఆయన సూచించారు. రెండో అంశం- దేశం కోసం ప్రతిజ్ఞ చేయడం మనం దేశం కోసం పనిచేస్తే, ప్రతి ఒక్క పని ని దేశం కోసం చేస్తున్నాము అని భావిస్తే, అప్పుడు ఆ పని వ్యక్తి కంటే గొప్పది అవుతుంది అని ఆయన చెప్పారు. మనం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో దేశానికి మనం ఏం చేయగలం అన్నది ఆలోచించాలి అని బాలలను ప్రధాన మంత్రి కోరారు.
ఇక మూడో అంశానికి వస్తే, అది వినమ్రత తాలూకు ప్రతిజ్ఞ. ప్రతి ఒక్క సఫలత మనను మరింత అణకువగా ఉండేటట్లు ఉత్తేజితం చేయాలి, మన వినమ్రత మన సాఫల్యాన్ని మనతో కలసి ఒక వేడుకగా జరుపుకొనేందుకు ఇతరులకు అవకాశాన్ని కల్పిస్తుంది అని ప్రధాన మంత్రి చెప్తూ, తన సంభాషణను ముగించారు. నూతన ఆవిష్కరణలు, విద్యా సంబంధిత కార్యసాధనలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ, సాహసం రంగాలలో అసాధారణమైన ఘన కార్యాలను సాధించడంతో పాటు అరుదైన సామర్ధ్యాలను ప్రదర్శించిన బాలలకు ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’లో భాగంగా భారత ప్రభుత్వం బాలశక్తి పురస్కారాలను ప్రదానం చేస్తూ వస్తోంది. ఈ సంవత్సరం బాల శక్తి పురస్కారాలకు చెందిన వివిధ కేటగిరీలలో దేశ వ్యాప్తంగా 32 మంది దరఖాస్తుదారులను ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల (పిఎమ్ఆర్బిపి)-2021’కు ఎంపిక చేయడం జరిగింది.