హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): మహిళలను హత్య చేయడమే పనిగా పెట్టుకున్నా ఓ వ్యక్తి. ఒంటరిగా కనిపించిన మహిళలను నగర శివర్లకు తీసుకెళ్లి హత్యలు చేసేవాడు. సైకోలా మారి ఏకంగా 16 మహిళలను హత్య చేశాడు. కానీ చివరకు ఓ చీటీ కారణంగా తను పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
జనవరి మొదటి వారంలో హైదరాబాద్ శివార్లలోని అంకుషాపూర్ సమీపంలో పోలీసులు సగం కాలిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అయితే మహిళ మోహం మీద పెట్రలోలు పోసి నిప్పు పెట్టడంతో ఆమెను గుర్తుపట్టడం కష్టంగా మారింది. చుట్టుపక్కల గాలించిన పోలీసులకు మృతిచెందిన మహిళకు సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదు.
ఆ సమయంలోనే పోలీసులకు మృతిచెందిన మహిళ చీరకొంగుకు ఓ ముడి కనిపించింది. అది విప్పి చూడగా అందులో ఓ చీటి.. దానిపై ఓ ఫోన్ నెంబర్ ఉంది. దీంతో పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అది నేరేడ్‌మేట్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ నంబర్ అని తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని అతడు పోలీసులకు తెలిపాడు. అయితే మృతిచెందిన మహిళ పేరు వెంకటమ్మ అని చెప్పాడు. ఆమె జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో నివసిస్తుందని పోలీసులకు తెలిపాడు.
చనిపోయిన మహిళ ఎవరో తెలుసుకున్న పోలీసులు ఆమె కుటుంబ సభ్యుల వివరాలు కనుగోనే ప్రయత్నం చేశారు. జనవరి 1న వెంకటమ్మ కనిపించకుండా పోయినట్టు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టుగా గుర్తించారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని కనుగొన్నారు. ఇక, నగరంలోని పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలోనే వెంకటమ్మ, ఓ వ్యక్తితో కలిసి ఆటో ఎక్కినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి గురించి వెంకటమ్మ కుటుంబ సభ్యులను ఆరా తీయగా అతనెవరో తమకు తెలియదని చెప్పారు.
నేరేడ్‌మేట్‌కు చెందిన వ్యక్తి కూడా అతడేవరో తెలియదనే సమాధానం ఇచ్చాడు. దీంతో పోలీసులకు ఏం చేయాలో తోచలేదు. వెంకటమ్మతో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు నగరమంతా గాలింపు చేపట్టారు. అతని ఫొటో పట్టుకుని గాలించారు. అయితే ఓ వ్యక్తి అతన్ని బోరబండలో చూసినట్టుగా పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ సందర్భంగా నిందితుడు పలు షాకింగ్ విషయాలను వెల్లడించాడు. ఒంటరిగా కనిపించిన చాలా మంది మహిళలను హత్య చేసినట్టు అతడు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు అతడు చెప్పిన వివరాలను క్రోడికరించిన పోలీసులు.. అతడు 16 మందని హత్యచేసినట్టు ప్రాథమికంగా తేల్చారు. అయితే అతడు ఎందుకోసం మహిళలను హత్య చేశాడనే విషయం తెలియాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.