అబ్బురపరిచిన సాంస్కృతిక ప్రదర్శనలు…
న్యూఢిల్లీ, జనవరి 26 (న్యూస్‌టైమ్): తొలిసారిగా రాఫెల్ యుద్ధ విమానాల గర్జన, మొదటిసారిగా వాయుసేన శకట ప్రదర్శనలో మహిళా ఫైటర్ పైలట్, తొలిసారి పరేడ్‌లో బంగ్లాదేశ్ సాయుధ దళం కవాతు.. ఇలా పలు ప్రత్యేకతలతో ఈసారి గణతంత్ర వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి. అలాగే విదేశీ అతిథి లేకుండా వేడుకలు నిర్వహించటం గత 55 ఏళ్లలో ఇదే తొలిసారి.
కరోనా నేపథ్యంలో ఈసారి వీక్షకుల సంఖ్యను కూడా 25 వేలకే పరిమితం చేశారు. మోటర్‌బైక్‌ల విన్యాసాలనూ రద్దుచేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 72వ గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. దేశ సైనిక పాటవాన్ని చాటిచెప్పే ప్రదర్శనలు, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే శకటాలు, అబ్బురపరిచే సైనిక విన్యాసాలతో పరేడ్ విశేషంగా ఆకట్టుకుంది. అంతకముందు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఎగురవేశారు.
వాయుసేన అమ్ములపొదిలోకి ఇటీవలే చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాఫెల్ విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. బ్రహ్మాస్త్రం రూపంలో చేసిన విన్యాసం అబ్బురపరిచింది. గణతంత్ర పరేడ్‌లో రాఫెల్ విమానాలు పాల్గొనటం ఇదే తొలిసారి. అలాగే, పరేడ్‌లో టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవి రష్యాలో తయారైన మూడోతరం యుద్ధ ట్యాంకులు. వీటికి భీష్మ అని పేరుపెట్టారు.
తూర్పు లఢక్‌లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం ఇప్పటికే ఈ యుద్ధ ట్యాంకులను 16 వేల అడుగుల ఎత్తున్న సరిహద్దు ప్రాంతాల్లో మోహరించింది. 5 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఇందులో 125 ఎంఎం తుపాకీ ఉంది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈ ట్యాంక్ ప్రయాణించగలదు. నీటిలోనూ వెళ్లగలదు. గైడెడ్ క్షిపణులను కూడా దీని ద్వారా ప్రయోగించవచ్చు. గగనతల లక్ష్యాలను ఛేదించేందుకు ఇందులో 12.7 ఎంఎం ఎన్వీఎస్‌టీ గన్ ఉంది. దీని పరిసరాల్లోకి వచ్చే శత్రు చాపర్లు, డ్రోన్లను ఇది నేలమట్టం చేయగలదు. రాత్రివేళల్లోనూ పనిచేయడం దీని ప్రత్యేకత.