తెలంగాణ‌కు మైనారిటీ కమిషన్ కితాబు

హైదరాబాద్, జనవరి 29 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై జాతీయ మైనారిటీ క‌మిష‌న్ వైస్ చైర్మన్ అతిఫ్ ర‌షీద్ ప్ర‌శంస‌లు గుప్పించారు. మైనార్టీల 15 సూత్రాల కార్యక్రమంపై అతీఫ్‌ రషీద్ శుక్ర‌వారం న‌గ‌రంలోని బీఆర్‌కేఆర్ భ‌వ‌న్‌లో‌ సమీక్ష నిర్వ‌హించారు. మైనార్టీలకు అమలు చేస్తున్న కార్యక్రమాలను సీఎస్ సోమేశ్ కుమార్ ఈ సంద‌ర్భంగా ర‌షీద్‌కు వివరించారు.

రాష్ట్రంలో షాదీ ముబారక్ అమ‌లు, మైనార్టీ గురుకులాల‌ను విజ‌య‌వంతంగా న‌డిపిస్తుండ‌టంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ పథకాలు విప్లవాత్మకంగా ఉన్నాయని దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయ‌ని పేర్కొన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం చేపడుతున్న స్మశానవాటికలు, ఆర్ధిక సహాయ పథకాలు, క్రిస్మస్ బహుమతులు వంటి వివిధ పథకాలను జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు కొనియాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర‌వింద్ కుమార్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్, కేంద్ర‌ మైనార్టీ సంక్షేమ జాయింట్ సెక్రటరీ డేనియల్ రిచర్డ్స్, డైరెక్టర్ ధనలక్ష్మి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, మహిళా,శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ షఫియుల్లా, ఇంటర్మిడియేట్ విద్యా కమిషనర్ ఒమర్ జలీల్, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన, తెలంగాణ రాష్ట్ర క్రిష్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏహెచ్ఎన్ కాంతివెస్లే, మైనారిటీస్ సంక్షేమ డైరెక్టర్ షాన్ వాజ్ ఖాసిం తదితర అధికారులు పాల్గొన్నారు.

Latest News