కోరాపుట్, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కోట్‌పాడ్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. సిందిగాం సమీపంలో వ్యాన్ బోల్తీ పడిన దుర్ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు మీడియాకు సోమవారం తెలిపారు.
ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 22 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీరంతా చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన జగదల్‌పూర్ వాసులు కాగా వీరందరూ సిందిగుడలోని పెద్దకర్మ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. బండి అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యసేవల నిమిత్తం జగదల్‌పూర్ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందుస్తున్నారు.