హైదరాబాద్, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): డబ్బుల కోసం కన్న తల్లిని చంపి ఇంట్లోనే కిందపడి మృతి చెందిందంటూ బంధువులను నమ్మించాడో కసాయి కొడుకు. అంత్యక్రియల్లో గాయాలు కనపడడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో అది హత్యగా తేలింది. దీంతో మృతురాలి కొడుకు, అతడి భార్యను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై వినయ్ కుమార్ వివరాల ప్రకారం… ఓల్డ్ బోయిన్పల్లి, ఫ్రెండ్స్ కాలనీకి చెందిన బాలమణి(57) ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌కోలో పారిశుద్ధ్య కార్మికురాలిగా ఉద్యోగం చేస్తుంది. ఈమె కుమారుడు శంకర్ (38) జులాయిగా తిరుగుతూ అప్పులు చేశాడు. ఆ అప్పులను తీర్చడానికి డబ్బులు ఇవ్వాలంటూ శంకర్, భార్య మంజుల(32)తో కలిసి గత నెల 17న తల్లితో గొడవకు దిగారు.
ఈ క్రమంలో తల్లిని తోసేయడంతో ఆమె కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించడంతో తల్లి ఇంట్లోనే కిందపడి మృతిచెందిందని బంధువులను నమ్మించాడు. మరుసటి రోజు అంత్యక్రియలు చేస్తుండగా బంధువులు, స్థానికులు బాలమణికి గాయాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలు కుమార్తె చంద్రకళ ఫిర్యాదు మేరకు పోలీసులు శంకర్, మంజులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు.