న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్‌వై) కింద 22 నూతన ఎఐఐఎంఎస్‌కు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 2017-18లో లేక ఆ తర్వాత మంజూరు చేసిన 10 ఎయిమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆమోదించిన ఆరు ఎయిమ్స్, భోపాల్, భుబనేశ్వర్, జోధ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రిషీకేష్‌లలో క్రియాశీలకం అయ్యాయి. మిగిలిన 16 నూతన ఎయిమ్స్ నిర్మాణంలో వివిధ దశలలో ఉన్నాయి. ఈ 16 ఎయిమ్స్ రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని కేబినెట్ ఏ తేదీన ఆమోదించింది, ఆమోదిత వ్యయ వివరాలు దిగువన ఇవ్వడం జరిగింది.
ఇప్పటికే క్రియాశీలకంగా ఉన్న 6 ఎయిమ్స్ ఆసుపత్రులకు అదనంగా, 6 ఎయిమ్స్‌లో ఓపీడీ సేవలు ప్రారంభమయ్యాయి. రాయబరేలీ, మంగళగిరి, గోరఖ్‌పూర్, భథిండా, నాగ్‌పూర్, బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రులలో ఈ సేవలు మొదలయ్యాయి. ఎంబిబిఎస్ కోర్సు 12 ఎయిమ్స్‌లలో ప్రారంభమయ్యాయి. అవి – మంగళగిరి, నాగ్‌పూర్, కళ్యాణి, గోరఖ్‌పూర్, భథిండా, రాయ్‌బరేలీ, దేవ్‌గఢ్, బీబీనగర్, బిలాస్‌పూర్, జమ్ము, రాజ్‌కోట్. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌లో నిర్మాణ పని జరుగుతోంది. తొలుత, నిర్మాణ పనుల కోసం ఇసుక అందుబాటులో లేకపోవడంతో కొంత జాప్యం జరిగింది.
నీటి సరఫరా ఏర్పాటు, తుపాను నీటిని తీసుకువెళ్ళే కాలువలు, క్యాంపస్ ప్రధాన అప్రోచ్ రోడ్డు, ప్రస్తుతం ఉన్న ఎన్‌డీఆర్ఎఫ్ క్యాంపస్‌ను తరలించడం వంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన కార్యకలాపాలు పూర్తి కావడంలో కొంత ఆలశ్యం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి కూడా పని ముందుకు సాగకుండా ప్రభావితం చేసింది. పీఎంఎస్ ఎస్‌వై కింద జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని కార్యనిర్వహక ఏజెన్సీలు, ఇతర భాగస్వాములు వాటిని సమయానుసారంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు.