విశాఖపట్నం, ఫిబ్రవరి 8 (న్యూస్‌టైమ్): విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతోకాలం లాభాల్లో నడిచిందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం దురదృష్టకరమని వైయస్‌ఆర్‌సీపీకి చెందిన విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. సమస్య ఉంటే పరిష్కరించాలే తప్ప విక్రయించే ఆలోచన సరికాదన్నారు. విశాఖలో ఎంవీవీ సత్యనారాయణ విలేకరుల మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు తెలుగు ప్రజలతో ఉన్న అనుబంధం అందరికీ తెలుసన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల ఫ్యాక్టరీల్లో విశాఖ ఉక్కు ఒకటని గుర్తుచేశారు.
కొన్నేళ్లు నష్టాలు వచ్చినా మళ్లీ కోలుకునే సామర్థ్యం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఉందన్నారు. స్వంత గనులు లేకనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వస్తున్నాయని, విస్తరణకు రుణాలు తీసుకున్నందున వడ్డీభారం కూడా అధికంగా ఉందన్నారు. రూ.22 వేల కోట్ల రుణభారాన్ని ఈక్విటీగా మార్చి సొంత గనులు ఇస్తే విశాఖ ఉక్కు లాభాలు సాధిస్తుందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానిని కలుస్తామని, ప్రధానికి ఆంధ్రుల సెంటిమెంట్‌ను వివరిస్తామన్నారు. కేంద్రం దిగిరాకపోతే రాజీనామాలకు కూడా వెనుకాడమన్నారు.