విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (న్యూస్‌టైమ్): స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా, చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికే ప్రధానికి లేఖ రాశా. సమస్యల పరిష్కారానికి మార్గదర్శక ప్రణాళిక సూచించాం. ఏపీలో ఇనుప ఖనిజం నిల్వలు లేవు, ఉన్నవి చాలా లోగ్రేడ్ గనులున్నాయి. ఒడిశాలో ఈ ప్లాంట్‌కు సొంతంగా గనులను కేటాయించాలని కోరాం. రుణాలను ఈక్విటీల రూపంలోకి మారిస్తే వడ్డీల భారం తగ్గుతుంది.
‘‘విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా చిత్తశుద్ధితో ఉంది. పోస్కో వాళ్లు రాష్ట్రానికి రావడం వాస్తవం, నన్ను కలవడం వాస్తవం. కడప, కృష్ణపట్నం, భావనపాడు ప్రాంతాల్లో ఫ్యాక్టరీ పెట్టమని పోస్కో వారిని కోరాను. కొందరు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడానికి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.’’ అని సీఎం తెలిపారు.
అంతకముందు, జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ విమానాశ్రయంలో సీఎంతో ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఎన్‌ఎండీసీని విశాఖ ఉక్కుతో అనుసంధానించాలని, దాని వల్ల సొంత గనుల సమస్య తీరుతుందన్నారు. అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా విశాఖలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.