విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (న్యూస్‌టైమ్): చాలా మంది టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీ వైపు చూస్తున్నారని, త్వరలోనే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఖాళీ అవుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత వి. విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం విశాఖ నగరంలోని 14వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కాకలపాటి అప్పలనర్సింహ రాజు (బాక్సర్ రాజు) తన మద్దతుదారులతో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలోని కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి వారిని విజయసాయిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు ఉంటాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిని అద్దంలో చూపించేశారు ప్రజలు. మున్సిపల్ – కార్పొరేషన్ ఎన్నికల్లో చేసేది లేక రౌడీయిజం, ప్రలోభాలకు తెగబడుతున్నారు టీడీపీ నేతలు. విజయనగరంలో బహిరంగంగానే కోడ్ ఉల్లంఘిస్తుంటే ఎస్ఈసీ ఏం చేస్తున్నట్లు? గుడ్డిగుర్రం పళ్లుతోముతున్నాడా? చంద్రబాబు సేవలో తరిస్తున్నాడా?’’ అని ప్రశ్నించారు.