ఒంగోలు, మార్చి 5 (న్యూస్‌టైమ్): ప్రజలకు సత్వరమే సేవలందించేలా సచివాలయ సిబ్బంది పనిచేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ సూచించారు. శుక్రవారం ఉదయం సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలు వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ అసిస్టెంటును ఆదేశించారు. సచివాలయ పరిధిలో అసంపూర్తిగా వున్న నిర్మాణాలన్నింటిని వెంటనే పూర్తి చేసేలా చూడాలన్నారు. వాటికి సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లింపులు జరగాలన్నారు. అంగన్ వాడి కేంద్రాలు రెండు పూర్తి అయినప్పటికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ గ్రాంట్ చెల్లించ లేదని పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. గృహనిర్మాణానికి సంబంధించి గురిజేపల్లి గ్రామంలో లేఅవుట్, జియోట్యాగింగ్, మ్యాపింగ్, రిజిస్ట్రేషన్ అంశాలపై ఆయన ఆరాతీశారు. 50 మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణి చేయగా వారిలో 27 మంది పేర్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇంజినీరింగ్ అసిస్టెంట్ జిల్లా కలెక్టర్‌కు వివరించారు. మిగిలినవి సాంకేతిక కారణాలతో నిలిచియాని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మ్యాపింగ్, రిజిస్ట్రేషన్ పై గృహనిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. పక్కా గృహాలు మంజూరైన లబ్దిదారుల చేత ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. గురిజేపల్లి గ్రామంలోని భూములకు సంబంధించిన రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమంపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎన్ని సర్వే నెంబర్లు వున్నాయని వి.ఆర్.ఓ.ను ప్రశ్నించారు. అతని నుండి సరైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ని సర్వే నెంబర్లు తెలుసుకోవలసిన బాధ్యత లేదా అంటూ వి.ఆర్.ఓ.ను నిలదీశారు. గురిజేపల్లి గ్రామంలో 500 కుటుంబాలలో 680 మంది జనాభా వున్నారని పంచాయతి సెక్రటరి కలెక్టర్ కు వివరించారు. పింఛన్లు పొందుతున్న వారికి వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించాలని కలెక్టర్ తెలిపారు. అలాగ్ 45 నుండి 59 సంవత్సరాలలోపు కోమార్బిడ్ వ్యక్తులను గుర్తించి కోవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఇంటింటికి మొబైల్ వాహనం ద్వారా నిత్యవసర సరుకుల పంపిణి సక్రమంగా జరుగుతున్నదా అని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 15 గ్రానైట్ క్వారీలు వుండటంతో గత ఏడాది సీన రేజ్ కింద సుమారు రూ. 70 లక్షలు పంచాయతీకి ఆదాయం లభించిందని గ్రామస్థులు ఆయనకు తెలిపారు. మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మంచినీటి సరఫరా చేసే పైపులైన్ మరమ్మతులకు గురి కావడంతోనే సమస్య వచ్చిందని గ్రామస్థులు ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్స్ నుండి త్రాగునీటి కొరకు ఖర్చు పెట్టుకోవచ్చని కలెక్టర్ స్పష్టంచేశారు. తంగెడుమల్లి, చవిటిపాలెం గ్రామాలకు సంబంధించిన మంచినీటి పథకం నిరుపయోగంగా మారడంతో త్రాగునీటి సమస్య తీవ్రతరమైందని జిల్లా కలెక్టరు గ్రామస్థులు వివరించారు. ప్రస్తుతం సి.పి.డబ్ల్యు. పథకాన్నీ పి.డబ్ల్యు. పథంకంలోకి మార్చాల్సిన అవసరం వుందని ఆర్.డబ్ల్యు.ఎస్. ఏ.ఇ. జిల్లా కలెక్టర్‌కు వివరించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని అధి కారిని ఆదేశించారు. గురిజేపల్లి గ్రామ పంచాయతీలో జరిగే పనులు, వచ్చే ఆదాయం, వ్యయం తదితర వివరాలు తెలుపడం లేదని గ్రామస్థులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ పంచాయతీలో చేపడుతున్న అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులపై స్పష్టంగా నోటీసు బోర్డులో ప్రచురించేలా త్వరలో సర్క్యులర్ ఇస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ జి.వి. శివరామి రెడ్డి, ఎమ్.పి.డి.ఓ. టి.వి. క్రిష్ణ కుమారి, హౌసింగ్ డి.ఇ. దాశరధి శర్మ, పంచాయతీ సెక్రటరి సి. హెచ్. వెంకయ్య, వి.ఆర్.ఓ., సర్వేయర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, తదితరులు వున్నారు.