తమిళ ఓటర్లపై వరాల జల్లు

రేషన్ కార్డ్ ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి..

తిరుచ్చి, మార్చి 8 (న్యూస్‌టైమ్): తమిళనాడులో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జాతీయ పార్టీల అగ్ర నేతలు తమిళనాడులో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ ఓటర్లపై వరాల జల్లు కురుస్తోంది. జనాలను ఆకర్షించేందుకు ఎవరికీ వారు హామీలు ఇస్తున్నారు. ఆదివారం తిరుచ్చిలో పర్యటించిన డీఎంకే నేత స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచార సభకు భారీగా జనం తరలివచ్చారు. ఆ జనాన్ని చూసి స్టాలిన్ ముఖం వెలిగిపోయింది. ఈ సందర్భంగా మహిళలకు ఓ వరం ప్రకటించారు స్టాలిన్. డీఎంకే అధికారంలోకి వస్తే రేషన్ కార్డున్న ప్రతి గృహిణికి రూ. వెయ్యి ఇస్తామని చెప్పారు.

తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీచేస్తున్నాయి. ఇక డీఎంకే కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 20 సీట్లు కేటాయించింది అన్నాడీఎంకే. కన్యాకుమారి లోక్‌సభ సీటును కూడా కాషాయ దళానికి అప్పగించింది. మరికొన్ని సీట్లను ఇతర మిత్రపక్షాలకు ఇచ్చింది అన్నాడీఎంకే. మిగతా సీట్లలో అన్నాడీఎంకే పోటీచేయబోతోంది. ఇక కాంగ్రెస్-డీఎంకే కూటమిలో.. కాంగ్రెస్ 25 సీట్లలతో పాటు కన్యాకుమారి లోక్‌సభలోనూ పోటీచేస్తోంది. డీఎంకే 180 సీట్లలో బరిలోకి దిగుతోంది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయింది. ఏప్రిల్ 6న ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. 38 జిల్లాల్లోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోంతో పాటు తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా మే2న ప్రకటిస్తారు.

Latest News