పరిషత్ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు

ఏలూరు, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. వెలగపూడి సచివాలయం నుండి సోమవారం పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ ఎం.గిరిజా శంకర్, ఎసి జాయింట్ సెక్రటరీ కె.కన్నబాబు సంయుక్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల సంసిద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు అన్ని మండలాలకు పంపడం జరిగిందన్నారు. ఓటర్ స్లిప్లను సుమారు 77 శాతం పంపిణీ చేయడం జరిగిందని, మిగిలినవి రేపటిలోగా పూర్తిచేస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలను 4, 5 తేదీలలో పంపిణీని పూర్తిచేయడం జరిగిందన్నారు. ఏజెన్సీ మండలాల్లో కుకునూరు, వేలేరుపాడు, పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలో పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చిన పోలింగ్ సమయాలను రాజకీయపార్టీలతో పాటు, పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు తెలియచేయడం జరిగిందన్నారు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మైక్రో అబ్జర్వర్లను, జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, పీఓలు, ఏపీఓలను నియమించి అవసరమైన శిక్షణను పూర్తిచేయడం జరిగిందన్నారు. వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు కెమెరాలను వాడుకోనుటకు అనుమతిని మంజూరు చేయాల్సిందిగా ఎస్‌ఈసీని కోరారు. కౌటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్రపరచుటకు ఏసీ ఉత్తర్వుల ప్రకారం జడ్పీటీసీ బ్యాలెట్ బాక్సులను జిల్లా ట్రెజరీనందు, ఎంపీటీసి బ్యాలెట్ బాక్సులను సబ్ ట్రెజరీలనందు భద్రపరచాలని వుందని, ఆయా కార్యాలయాలలో కొన్నింటిలో స్థలాబావం, మరికొన్ని మరమ్మత్తులలో వుండుటవలన భద్రపరచుట సాధ్యపడదని, ఏలూరు కలెక్టరేట్‌లో వున్న గిరిజన్ భవన్ వినియోగించుకోవడానికి అనుమతివ్వాలని కోరారు.

ఇందుకు ఏసీ జాయింట్ సెక్రటరీ స్పందిస్తూ ప్రతిపాదనలను పంపాలని తెలిపారు. జిల్లాలో చిన్న 8,083, మధ్య 510, పెద్ద 2,420 మొత్తం 11,013 బ్యాలెట్ బ్యాక్సులు అందుబాటులో వున్నాయన్నారు. జిల్లాలో మొత్తం 23,58,687 మంది ఓటర్లు వున్నారని తెలిపారు. ఆర్ఓలు 48, ఎఆర్ఓలు 96, పిఓలు 3,458, ఓపిఓలు 17,256, జోనల్ ఆఫీసర్స్ 180, రూట్ ఆఫీసర్స్ 364, కౌంటింగ్ సూపర్వైజర్స్ 904, కౌటింగ్ అసిస్టెంట్స్ 2,714 మందిని నియమించడం జరిగిందన్నారు. జిల్లాలోని 396 ప్రాంతాల పరదిలోని 942 సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో 456 మందికి మైక్రోఅబ్జర్వర్స్ విధులను కేటాయించడం జరిగిందన్నారు. బందోబస్తు విధులను పోలీస్ శాఖ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

కొవిడ్ నిబంధనలను అనుసరించి మాస్క్‌లు, ధర్మల్ స్కానర్స్, శానిటైజర్స్, గ్లోజులు, పిపిఇ కిట్టన్ను సిద్ధంచేయడం జరిగిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద లైటింగ్, షామియానా, త్రాగునీరు, మెడికల్ టీమ్స్ ఏర్పాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ సిద్ధంగా వుంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా జాయింట్ కలెక్టర్లు కె.వెంకటరమణారెడ్డి, ఎస్.తేజ్ భరత్, జడ్పీటీసీ,ఎంపీటీసి ఎన్నికల ప్రత్యేక అధికారిణి జి.జ్యోతి, జెడ్ పి సిఇఓ పి.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News