హైదరాబాద్ : ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీనరేంద్రమోడీ నాయకత్వంలో ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న శుభసందర్భంగా డిజిటల్ వేదికపై మెగా వర్చువల్ ర్యాలీ జరిగింది.ఆంధ్రప్రదేశ్ పార్టీ రథసారథి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన కార్యదర్శి మన తెలుగు బిడ్డ శ్రీ రామ్ మాధవ్ ప్రసంగిస్తూ ఏడాది పాలన సందర్భంగా తాను వైకాపాకు శుభాకాంక్షలు చెబితే అది వైకాపా పాలనకు తాను ఇచ్చిన సర్టిఫికేట్ కాదని,ఏడాదిలో వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలను లెక్కపెడుతున్నామని,జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీలో అన్నీ రివర్స్‌లో నడుస్తున్నాయని,మద్యపాన నిషేదం విషయంలోనూ రివర్స్ అడుగులు వేస్తున్నారని తప్పుపట్టారు. హైకోర్టుతో ఇప్పటికే 60సార్లు మొట్టికాయలు తిన్న ప్రభుత్వం దేశంలో మరెక్కాడా లేదన్నారు. వైకాపా ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయిందని ‘కరోనా’తో పూర్తిగా ఆదాయం పడిపోయిందన్నారు. ప్రధాని మోడీ చొరవతో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి రూ.35వేల కోట్లు ఇస్తామని చెప్పారని, కోవిద్‌ను డిజాస్టర్‌గా భావించి ఇప్పటికే రూ.11వేల కోట్లను రాష్ట్రానికి ఇచ్చారన్నారు. చంద్రబాబు అత్యాశతో ఎన్‌డిఎ నుంచి వెళ్లిపోయారని, ఆయన ప్రధాని కావాలనే ఆశతోనో..లేక ఇంకేదో కారణంతోనే బయటకు వెళ్లారో తెలియదన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర పథకాలకు తన పేరు పెట్టుకుని ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని రాంమాధవ్ దుయ్యబట్టారు.బిజెపి శ్రేణుంతా ‘కరోనా’ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 2019లో అతిపెద్ద మెజార్టీతో అధికారంలోకి వచ్చామని, ఏడాది పాలనకు గుర్తుగా వర్చువల్ ర్యాలీలు చేపట్టామని, ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. కరోనా వల్ల ప్రజల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లలేకపోతున్నామని ‘మోడీ’ ప్రభుత్వం పారదర్శక, స్వచ్ఛమైన పాలన అందిస్తుందని రామ్‌మాధవ్ అన్నారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో ఢిల్లీ, జైపూర్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం,కాకినాడ, అమలాపురం వివిధ ప్రదేశాల నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్,విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, పార్థసారధిలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పరోక్షంగా రాష్ట్ర సహా ఇంచార్జ్ సునీల్ దియోధర్, రాజ్యసభ సభ్యులు జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ఎంఎల్సీలు సోము వీర్రాజు,పి.వి.యన్ మాధవ్, మాజీ మంత్రివర్యులు పి.మాణిక్యాలరావు , రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ ,అన్నిజిల్లా అధ్యక్షులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.