హైదరాబాద్, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): సినిమా ధియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీతో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి నిర్మాతలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే, మరోవైపు ధియేటర్లు మళ్లీ మూతకు రంగం సిద్దం అవుతుంది. నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్ అయింది టాలీవుడ్ పరిస్థితి. 100 శాతం ఆక్యుపెన్సీతో ధియేటర్లకు పర్మిషన్ వచ్చినా, నిర్మాతలు, ఎగ్జిబీటర్ల మధ్య అభిప్రాయ బేధాల వల్ల సినిమా ధియేటర్లు మళ్ళీ మూత పడబోతున్నాయంటున్నారు సినీ ప్రముఖులు.
మల్టీప్లెక్స్‌కి ఇస్తున్నట్టు సింగిల్ స్క్రీన్ థియేటర్లకూ పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబీటర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ నిర్మాతలు దీనికి ఒప్పుకోవటం లేదు. నిర్మాతలు తమ సినిమాలను ధియేటర్లో విడుదల చేసిన వారం రోజుల్లోనే ఓటీటీల్లో రిలీజ్ చేస్తుండటంతో తమకు భారీ నష్టం వస్తుందని బాధపడుతున్నారు. దీనిపై కూడా నిర్మాతలు వెనక్కి తగ్గటం లేదు. రిలీజ్ అయిన 6 వారాల తర్వాత ఓటీటీల్లో రిలీజ్ చేసుకోమని చెబుతున్నా నిర్మాతలు కనీసం వినటం లేదంటున్నారు. దీని వల్ల థియేటరల్ మూసుకోవాలసి వస్తుందంటున్నారు. తమ సమస్య పరిష్కరించని పక్షంలో థియేటర్లను మళ్లీ మూసేస్తామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు.