వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల…
అమరావతి, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అరాచకాలు చేయడం బాగా అలవాటు అని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా భయాందోళనలు సృష్టించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అరాచకాలకు నిమ్మాడ తాజా ఘటనకు నిదర్శనమన్నారు. ఎన్నికల కమిషనర్ టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏకగ్రీవాలయ్యే పంచాయతీలకు నజరానా భారీగా పెంచామన్నారు. మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా అనేక ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించడం తప్పని చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు. పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితిల్లో సాధారణంగా ఏకగ్రీవాలు జరుగుతాయన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమే విజయమని చంద్రబాబు అనుకుంటున్నారని చెప్పారు.
నిమ్మాడలో నామినేషన్ వేయకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దౌర్జన్యానికి దిగారని తెలిపారు. స్థానికంగా భయాందోళనలు సృష్టించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అరాచకాలకు తాజా ఘటనలే నిదర్శనమన్నారు. అచ్చెన్నాయుడి సొంత గ్రామం నిమ్మాడలో దశాబ్ధాలుగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమవుతున్నాయని గుర్తు చేశారు. అక్కడ ఒకే కుటుంబం ఎన్నికవుతుందని, వారిని ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లేదన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో వేరే వారు పోటీ చేయకుండా అచ్చెన్నాయుడి కుటుంబం బెదిరించేదన్నారు. గతంలో టీడీపీ నేతలను వ్యతిరేకించిన 8 మంది హత్యకు గురయ్యారని తెలిపారు. నిమ్మాడలో ఇంతవరకు స్వేచ్ఛగా నామినేషన్ వేసిన సందర్భాలు లేవన్నారు.
అన్ని పంచాయతీల్లో పోటీ పెట్టాలంటున్న చంద్రబాబు..అచ్చెన్నాయుడి సొంత గ్రామంలో మాత్రం ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి నియోజకవర్గంలో ఓసారి మహిళా నేత పోటీ చేసేందుకు వస్తే ఆమెకు చీర పెట్టి పంపించాలని వైయస్ రాజశేఖరరెడ్డి చెప్పారే కానీ, ఎప్పుడు, ఎవరిని బెదిరించిన దాఖలాలు లేవని, ఆ గ్రామంలో ఇలా పోటీ చేసిన వారిపై దౌర్జన్యం లేదని, ఏ ఎన్నికలు జరిగినా సతీష్‌రెడ్డి పోటీ చేస్తూనే ఉంటారని గుర్తు చేశారు.
నిమ్మాడలో ఈసారి అచ్చెన్నాయుడి దగ్గరి బంధువు కింజారపు అప్పన్న నామినేషన్ వేసేందుకు వెళ్తే అచ్చెన్నాయుడు దౌర్జన్యం చేశారన్నారు. అదేదో తప్పు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల కమిషనర్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని, నిమ్మాడకు నిమ్మగడ్డ ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. తూర్పు గోదావరి జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త అనుమానస్పద స్థితిలో మృతి చెందితే దాన్ని రాజకీయం చేసేందుకు ఎస్‌ఈసీ హుటాహుటిన వెళ్లారని తప్పుపట్టారు. నిమ్మాడ ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. టీడీపీకి అనుకూలంగా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఊదాహరణగా చెప్పవచ్చు అన్నారు.
విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటనలో టీడీపీ డ్రామా కనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఎందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అంబేద్కర్ పేరుతో ఉన్న కాలనీలో దాడి జరిగిందని పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారని తప్పుపట్టారు. అచ్చెన్నాయుడి ఘటన నుంచి డైవర్ట్ చేయడానికే టీడీపీ హడావుడి చేస్తున్నట్లు కనిపించిందన్నారు. గతంలో మల్లెల బాజ్జి ఘటన కూడా ఇలాగే జరిగిందన్నారు. చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో చంద్రబాబు అన్న మాటలు గుర్తు చేశారని, ఉద్యమమంటే రెండు బస్సులైన తగలబడాలని చెప్పినట్లు వివరించారు. ఇలాంటి మనస్తత్వం వైయస్ జగన్‌కు ఏనాడు లేదన్నారు.
గడిచిన పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇలాంటి ఆలోచనలు చేయలేదన్నారు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై చర్చ జరగాలన్నదే చంద్రబాబు మనస్తత్వమన్నారు. ఇటీవల అంబేద్కర్ విగ్రహానికి అపచారం చేశారని, ఇదంతా చంద్రబాబు రహస్యంగా తన పార్టీ శ్రేణులకు చెప్పి చేయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఇటీవల వరసగా దేవాలయాలపై దాడులు జరిగాయని, త్వరలో అంబేద్కర్, వంగవీటి రంగా విగ్రహాలను టార్గెట్ చేయాల్సిందిగా టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసి ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేస్తారు.
అటువంటి అరాచక ఆలోచనలు చంద్రబాబుకు అలవాటు అన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేకంగా యాప్ తయారు చేయించుకున్నారట..ఆ యాప్‌పై విశ్వసనీయత లేదన్నారు. ప్రభుత్వం తయారు చేయించిన యాప్‌లపై ఎస్‌ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. గత ఎన్నికల్లో ఉపయోగించి సీ విజిల్ యాప్ కూడా సాంకేతికంగా బ్రహ్మండంగా ఉందని, అయితే నిమ్మగడ్డ రమేష్ ఈ యాప్‌లను ఉపయోగించేందుకు ఇష్టపడకుండా తన సొంత యాప్‌నే ఉపయోగిస్తున్నారని తెలిపారు. అందుకే తమ పార్టీ కూడా ఒక యాప్‌ను కార్యకర్తలకు అందిస్తున్నామని, గ్రామాల్లో ఎక్కడైన డబ్బు, మద్యం, ప్రలోభాలు జరిగితే కేంద్ర కార్యాలయానికి వీడియోలు పంపించాలని, వాటిని ఎన్నికల సంఘానికి అందజేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.