అరకు : అందాల అరకు లోయలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు కాబోతున్నది.అరకు ఏజెన్సీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి పౌర సంక్షేమ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా స్వచ్చందం లాక్ డౌన్ అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు సంఘం సభ్యులు చెప్తున్నారు. స్వచ్చంద లాక్డౌన్ కు అటు వర్తకుల సంఘం కూడా మద్దతు ప్రకటించింది. ప్రతి శుక్రవారం నిర్వహించే అరకు వారపుసంత ఇప్పటికే అధికారులు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
విశాఖ జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక కేసులు విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. విశాఖపట్నంతో పాటుగా అటు అరకులోయలో కూడా కేసులు క్రమంగా విస్తరిస్తున్నాయి. అరకులోయ,ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా విస్తరిస్తే రోగులను గుర్తించడంతో పాటు వైద్యం అందించడం కూడా కొంత కష్టంగా మారుతుంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా అక్కడి పౌర సంక్షేమ సంఘం ఈ స్వచ్చంద లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది.