అమరావతి, జనవరి 21 (న్యూస్‌టైమ్): చట్టాలు, రాజ్యాంగాలు బాగా తెలుసని చెప్పుకునే చంద్రబాబు వాటినే కించపరిచేలా మాట్లాడుతున్నాడని, చిన్న పిల్లల మాటలకంటే అధ్వాన్నంగా చంద్రబాబు మాటలున్నాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసుకొని ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు మానసిక స్థితిని ఏమనుకోవాలో అర్థం కావడం లేదని, ఒక్కోసారి బాబును చూస్తే బాధ అనిపిస్తుందన్నారు. 41 సీఆర్‌పీసీ నోటీస్‌పై 40 ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడికి అవగాహన లేదా..? అని ప్రశ్నించారు. కనీస సమాచారం లేకుండా మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడగలుగుతారని నిలదీశారు.
తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంఓ సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు శాడిజం ఏంటో అర్థం కావడం లేదన్నారు. డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుకు ఎందుకు అంత ఆవేశం, ఫ్రస్టేషన్? అని ప్రశ్నించారు. నిన్న కళా వెంకట్రావ్‌కు పోలీసులు కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి.. అతని వైఖరి తెలుసుకున్నారని, అదే విధంగా ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తిని 13వ తేదీనే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. సంతబొమ్మాళిలో నందీశ్వరుడి విగ్రహం తొలగించి రోడ్డుపై దిమ్మమీద పెట్టింది టీడీపీ నేతలేనని సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా ప్రజలందరికీ తెలిసిందన్నారు.
‘‘రాముడి విగ్రహం తల నరికారు అనే మాట వినడానికే ఇబ్బందిగా, కంపరంగా ఉంటుంది. అలాంటిది చంద్రబాబు తన ప్రెస్‌మీట్‌లో పది సార్లు ఏకంగా రాముడి తల నరికారని మాట్లాడారు అంటే చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గాలేదా? హిందూ మతాన్ని అభిమానించే వాళ్లంతా చంద్రబాబు భాషను ఏమనుకుంటారో.. వాళ్ల విచక్షణకు వదిలేయాలి. ఏకంగా దేవుడినే తీసుకొచ్చి తల నరకడం అనే పదం వాడారు అంటే ఆయన్ను ఏమనాలో అర్థం కావడం లేదు.
కళా వెంకట్రావ్‌ను ఎందుకు పోలీసులు తీసుకెళ్లారో చంద్రబాబుకు తెలియదా..? ఏం జరిగిందని తెలుసుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. నిన్న రాత్రి కళా వెంకట్రావ్‌కు 41ఏ సీఆర్‌పీసీ నోటీస్ ఇవ్వడానికి పోలీసులు పిలిచారు. ఆయన సంతకం తీసుకొని సాగనంపారు. 41ఏ సీఆర్‌పీసీ నోటీస్ పరిధి ఏంటో తెలియదా? మా పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి ఇచ్చిన కంప్లయింట్‌పై పోలీసుల విచారణ భాగంగా దాడి చేయడం, ఎంపీ కాన్వాయ్‌పై రాళ్లు పడడం వాస్తవం అని తేలింది. ఆ దాడి జరిగిన ఘటనలో కళా వెంకట్రావ్ ఉన్నారు కాబట్టి.. అతని వైఖరి తెలుసుకునేందుకు 41ఏ సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చారు. దాంట్లో ఉన్న తప్పేంటీ? 40 ఇయర్స్ ఇండస్ట్రీకి చట్టం ఎలా ఉంటుందో బాబుకు తెలియదా? ప్రతిపక్ష నేతగా వాస్తవాలను మాట్లాడాలనే ఇంగింతం కూడా లేదా?
సంతబొమ్మాళిలో నంది విగ్రహం తరలింపు సీసీ కెమెరా ఫుటేజీ చూస్తే టీడీపీ నాయకులు అని తేలింది. అయ్యన్నపాత్రుడు అనే వ్యక్తి ఆ ఘటనను విగ్రహ ప్రతిష్ఠ అని మాట్లాడుతున్నాడు. విగ్రహాన్ని ఎవరైనా పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టడం ప్రతిష్ఠాపన అవుతుందా..? సీసీ కెమెరా ఫుటేజీ దొరకగానే విగ్రహ ప్రతిష్ఠాపన అని మాట మారుస్తున్నారు. చంద్రబాబు అయితే పది అడుగులు దూకి అవును పెట్టారు.. అంటూ దబాయిస్తున్నారు. వైయస్‌ఆర్ విగ్రహం రోడ్డు మీద పెట్టొద్దని ఆలయంలోని నంది విగ్రహం తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టారంట.. దీనిపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్ ప్రతినిధులు స్పందించాలి. చంద్రబాబుది కంప్యూటర్ నాలెడ్జ్ అని అంటుంటారు కదా..? 13వ తేదీన ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేశారని ఆ కంప్యూటర్ నాలెడ్జ్‌కి తెలియదా..? అరెస్టు వార్త పచ్చపత్రికల్లో, పచ్చ ఛానళ్లోనూ వచ్చింది కదా? ప్రవీణ్ చక్రవర్తిని అడ్డంపెట్టుకొని ప్రభుత్వంపై ఎలా దాడి చేయాలనే దుగ్ద తప్ప చంద్రబాబుకు మరేమీ లేదు.
ప్రవీణ్ చక్రవర్తిని ఎక్కడ దాచిపెట్టారు.. డీజీపీ ఇంట్లోనా..? వైయస్ జగన్ ఇంట్లోనా..? అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. తలకాయ ఉండి మాట్లాడుతున్నారా? ప్రవీణ్‌కు కడపలో బ్యాంక్ అకౌంట్ ఉందంటున్నారు. ఎనీవేర్ బ్యాంకింగ్, అకౌంట్ ఉన్న చోటే ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదనే కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. ప్రవీణ్ చక్రవర్తిపై టీడీపీ హయాంలోనే కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. మత రాజకీయాలు చేసి ప్రజల నుంచి సానుభూతి పొందాలనే అత్యంత నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు తనను తాను తిట్టుకున్నట్లుగానే ఉంది.
ప్రత్యేక హోదా అనే అత్యంత ప్రధానమైన అంశంపై క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు వైయస్ జగన్ విశాఖకు వెళ్తే ఆ రోజుల్లో ఏం చేశారు. విమానం దిగితే.. రన్‌వేపైనే నిర్బంధించి.. తిరిగి వెనక్కి పంపించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందే వైజాగ్‌ను తలబెట్టడానికి వస్తున్నారా అని చంద్రబాబు అన్నారు.. ఆ నోటి నుంచి ఆ మాట ఎలా వచ్చింది. సమ్మిట్‌లు ఎలా జరిగాయో.. ఎవరెవరికి సూట్లు వేసి తీసుకొచ్చి సంతకాలు తీసుకున్నారో తెలుసు.. అవి తరువాత చెత్తబుట్టల్లో దొరకడం అందరికీ తెలుసు.
జేసీ దివాకర్‌రెడ్డి బస్సు యాక్సిడెంట్‌లో 11 మంది చనిపోతే.. ఆ మృతదేహాలను ఎవరికీ తెలియకుండా తరలిస్తున్న నేపథ్యంలో వైయస్ జగన్ ప్రతిపక్షనేతగా ఆస్పత్రికి వెళ్లి అధికారులను ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు ప్రవర్తించిన తీరు ఏంటీ? దెబ్బతిన్న పంటను పొలంలోకి దిగి పరిశీలిస్తే.. పక్క పొలం వ్యక్తితో ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్‌పై కేసులు పెట్టించిన నీచ చరిత్ర చంద్రబాబుది. ఎమ్మెల్యే రోజాను అక్రమంగా అరెస్టు చేసి.. ఏ విధంగా రోడ్ల మీద తిప్పారో.. అందరూ చూశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై దాడి చేసుకుంటూ పోలీస్ స్టేషన్లు అన్నీ తిప్పారు. ఇప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను ఆటోలో తీసుకెళ్లారు. ఏ స్టేషన్‌లో ఉన్నాడో వెతుక్కోవాల్సి వచ్చేది. ఘోరాలు అంటే చంద్రబాబు చేసినవి.
చంద్రబాబును చూస్తే వృద్ధులను చూసినట్లు జాలి కలుగుతుంది. పిచ్చి మాలోకం అనుకోవాలో తెలియడం లేదు. పిచ్చి ముదిరి.. ఆస్పత్రిలో చేర్పించే స్థితిలో ఉన్నారా..? తెలియడం లేదు. ఇలాంటి వారు మన ఇంట్లో వాళ్లయితే వదిలేసి.. రూమ్‌లో పెట్టి తాళం వేయొచ్చు. కానీ, ఒక పార్టీ అధ్యక్షుడు, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు. పోలీస్ డిపార్టుమెంట్ ఎలా ఉండకూడదో అని చంద్రబాబు పాలనలో నుంచి నేర్చుకోవచ్చు. వైయస్ జగన్‌పై కత్తి దాడి జరిగితే.. ఎవరికైనా లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నా.. ముందు సానుభూతి చూపించి.. పరామర్శించి, దోషులను పట్టుకుంటామని మాట్లాడుతారు. అరగంట తిరక్కముందే జగన్ అభిమానే చేశాడని అప్పటి డీజీపీతో చెప్పించారు. ఏబీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గురించి కూడా అందరికీ తెలుసు.
కళా వెంకట్రావ్‌ది అరెస్టు కాదు.. అరెస్టు అని మాట్లాడడం తప్పు.. సమాచారం లేకుండా మాట్లాడడం వల్ల ప్రతిపక్ష నేతగా కాదు.. బాధ్యతాయుతమైన పౌరుడిగా కూడా అర్హత కోల్పోయారని వ్యక్తిగతంగా అనిపిస్తుంది. ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి అల్రాడీ అరెస్టు అయ్యాడు. సమాచారం తీసుకొని చంద్రబాబు మాట్లాడితే మంచిది. ఎవరో పవన్ కల్యాణ్ లాంటి అప్పుడప్పుడు రాజకీయాలు చేసేవారు ఇలా మాట్లాడితే సరిపోతుందేమో కానీ, వృత్తి రాజకీయ నాయకుడు చంద్రబాబు మాట్లాడడం సరికాదు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.