గుంటూరు, ఏప్రిల్ 3 (న్యూస్‌టైమ్): జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శంగా ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యం బలపడేలా నిర్వహించాలని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల జిల్లా పరిశీలకులు డా.పి.లక్ష్మీ నరసింహాం ఎన్నికల అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో ఎంపీటీసీ, జడ్పీటీసీ సాధారణ ఎన్నికల నిర్వహణపై ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల జిల్లా పరిశీలకులు లక్ష్మీ నరసింహాం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి, రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీతో కలిసి ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పోలీసు అధికారులు ఎన్నికల విధులు కేటాయించిన అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల జిల్లా పరిశీలకులు డా.పి.లక్ష్మీ నరసింహాం మాట్లాడుతూ జిల్లాలో మున్సిపల్, పంచాయితీ ఎన్నికలు జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు చక్కగా నిర్వహించారని అదే స్పూర్తితో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే భవనం ఆవరణలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉంటే ఓటర్లుకు వారి ఓటు ఉన్న పోలింగ్ కేంద్రంకు పంపించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్–19 మరియు వేసవి కాలం వడగాల్పుల దృష్ట్యా పోలింగ్ సిబ్బంది, ఓటర్లుకు పోలింగ్ కేంద్రాలు వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ విధులు కేటాయించిన అధికారులు ఏప్రిల్ 5వ తేదిలోపు కోవిడ్–19 వాక్సినేషన్ వేయించుకోవటం మంచిదన్నారు.
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, నగదు, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి నిబంధనల మేరకు చర్యలు తీసుకుని అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు కొన్ని సంఘటనలు మినహా సజావుగా జరిగేలా టీం వర్క్‌తో పనిచేసిన జిల్లా అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నామన్నారు. అదే విధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల విధులలో పాల్గోనే అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
జిల్లాలో 579 ఎంపీటీసీ స్థానాలకు, 46 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయాలన్నారు. కోవిడ్–19 దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యర్ధుల ప్రచారంలో ఐదు మంది కంటే ఎక్కువ పాల్గొనకుండా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో విధులు కేటాయించిన పీవో, ఏపీవోలకు ఏప్రిల్ 5వ తేదీన మండలస్థాయిలో శిక్షణ అందిస్తామని, మైక్రో అబ్జర్వర్లుకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు వేగవంతంగా పూర్తి చేయటానికి ప్రతి ఎంపీటీసీకి ఒక టేబుల్ చొప్పున మండలస్థాయిలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్లు లెక్కింపుపై సిబ్బందికి రెండు సార్లు శిక్షణ ఇవ్వాలన్నారు. కోవిడ్–19 సెకండ్ వేవ్ దృష్ట్యా ఎన్నికల విధులలో పాల్గోనే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, చేతులు తరుచూ శానిటైజేషన్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలన్నారు.
వేసవి కాలంలో వడగాల్పులు పెరుగుతున్న దృష్ట్యా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ నీరు తీసుకోవాలన్నారు. పోలింగ్ బందోబస్తు కేటాయింపు కోసం సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు వారీగా సబ్కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా సమీక్ష చేసి గతంలో జరిగిన ఎన్నికలలో సంఘటనలు ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలు వద్ద అనుకోని సంఘటనలు జరిగితే జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు మూడు నిమిషాలలో చేరే విధంగా జోనల్, రూట్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలలో విధులలో ఉన్న అధికారులందరు తప్పనిసరిగా కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి, రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పర్యవేక్షణ కోసం నియమించిన మొబైల్ టీంలతో పోలీస్ స్రైకింగ్ ఫోర్స్ టీంలు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు.
ఎన్నికల బందోబస్తులో ఉన్న ప్రతి ఒక్క పోలీసు కోవిడ్–19 దృష్ట్యా మాస్క్ ధరించటం, చేతులు శానిటైజేషన్ చేసుకోవటం, భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజా సమూహాలను నివారించేందుకు అవసరమైన ప్రాంతాలలో బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఓటింగ్, కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు నిరంతరం అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ది) పి ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికల విధులలో పనిచేసే క్షేత్రస్థాయి అధికారులకు మండలస్థాయిలో శిక్షణ అందించాలన్నారు. కోవిడ్–19 సెకండ్ వేవ్ దృష్ట్యా ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులందరూ వెంటనే కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (అసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, ఎస్ఈబీ ఏఎస్పీ ఆరీఫ్ హఫీజ్, జిల్లా పరిషత్ సీఈవో చైతన్య, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహశీల్దారులు, రిటర్నింగ్ అధికారులు, పీవోలు, ఏపీవోలు, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు పాల్గొన్నారు.