న్యూఢిల్లీ, జనవరి 26 (న్యూస్‌టైమ్): భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ సైనిక పాటవాన్ని చాటి చెప్పేలా ఆయుధ ప్రదర్శనలు, ఘనమైన సాంస్కృతిక వారసత్వం, ఆర్థిక పురోగతిని ప్రతిబింబించే శకటాలు, అబ్బురపరిచే సైనిక విన్యాసాలతో ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద నిర్వహించిన పరేడ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సైనికులు 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.
అంతకుముందు జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కరోనా నేపథ్యంలో రాజ్‌పథ్ పరేడ్‌కు హాజరయ్యే వీక్షకుల సంఖ్యపై పరిమితి విధించారు. 15 ఏళ్లలోపు పిల్లలను, 65 ఏళ్లు పైబడినవారిని అనుమతించలేదు. పరేడ్‌లోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణంగా 8.5 కిలోమీటర్ల మేర దళాలు పరేడ్ నిర్వహిస్తాయి. అయితే ఈసారి 3.5 కిలోమీటర్లకే పరిమితం చేశారు. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, పారామిలిటరీ బలగాలకు చెందిన 9 శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు.
దాదాపు 55 ఏళ్ల తర్వాత, తొలిసారి విదేశీ అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి. అయితే, 122 మంది సభ్యులు గల బంగ్లాదేశ్ త్రివిధ దళాలు మార్చ్‌లో పాల్గొన్నాయి. 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యుద్ధం ద్వారానే బంగ్లాదేశ్ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళిగా బంగ్లాదేశ్ దళం పరేడ్‌లో పాల్గొంది. వాయుసేన అమ్ములపొదిలోకి ఇటీవలే చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాఫెల్ విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. బ్రహ్మాస్త్రం రూపంలో చేసిన విన్యాసం అబ్బురపరిచింది. గణతంత్ర పరేడ్‌లో రాఫెల్ విమానాలు పాల్గొనటం ఇదే తొలిసారి.
మరోవైపు, చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో పాటు వివిధ దేశాల్లోని భారతీయులు గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. చైనాలోని బీజింగ్‌లో భారత రాయబారి విక్రమ్ మిస్రీ జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత సైన్యం ఎప్పటిలాగే తన ఆయుధ సంపత్తిని సగర్వంగా ప్రదర్శించింది. టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణి, పినాక మల్టీ లాంచర్ రాకెట్ వ్యవస్థలు ఆకర్షణగా నిలిచాయి. తేజస్, రాఫెల్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలను వాయుసేన ప్రదర్శించింది. 1971 భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్న ఐఎన్‌ఎస్ విక్రాంత్ నమూనాను నావికాదళం ప్రదర్శించింది. డీఆర్‌డీవో నుంచి రెండు శకటాలు పాల్గొన్నాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. అయోధ్య రామమందిర నమూనాతో రూపొందించిన ఉత్తరప్రదేశ్ శకటం, లేపాక్షి నందితో కూడిన ఆంధ్రప్రదేశ్ శకటం ఆకట్టుకున్నాయి. మోదెరాలోని సూర్యదేవాలయంతో గుజరాత్, భక్తి ఉద్యమం ఇతివృత్తంతో మహారాష్ట్ర, పల్లవుల ఆలయ నిర్మాణాలతో తమిళనాడు శకటాలను ప్రదర్శించాయి.
రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలి మహిళా యుద్ధ విమాన పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ చరిత్ర సృష్టించారు. తేలికపాటి యుద్ధవిమానం, హెలికాప్టర్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం, రోహిణి రాడార్ నమూనాలు ఉంచిన వైమానిక దళ శకటంపై ముగ్గురు పురుష పైలట్లతో పాటు భావనా కాంత్ కూడా నిలుచున్నారు. తొలి ముగ్గురు మహిళా యుద్ధ విమాన పైలట్లలో ఆమె కూడా ఒకరు. మిగతా ఇద్దరు అవని చతుర్వేది, మోహనా సింగ్. వీరు ముగ్గురూ 2016లో వైమానిక దళంలో నియమితులయ్యారు.
భారత సంతతికి చెందిన అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త నరీందర్ సింగ్ కపనీకి పద్మ విభూషణ్ అవార్డు (మరణానంతరం) లభించడంపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఫాదర్ ఆఫ్ ది ఫైబర్ ఆప్టిక్స్’గా పేరొందిన కపనీ వేగవంతమైన ఇంటర్నెట్ ప్రసారాలకు వినియోగించే ఫైబర్ ఆప్టిక్స్ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ‘ఫైబర్ ఆప్టిక్స్’ అనే పదాన్ని కూడా ఈయనే సృష్టించారు. లేజర్ సాంకేతికత, సోలార్ ఎనర్జీలో వచ్చిన పలు విప్లవాత్మక మార్పులకు ఆయన పరిశోధనలే కీలకం. వృద్ధాప్య సమస్యలతో గత నెల 4న కపానీ (94) కన్నుమూశారు. కాగా, జాతీయ వేడుకల సందర్భంగా తలపాగా ధరిస్తున్న ప్రధాని మోదీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈసారి గుజరాత్‌లోని జామ్‌నగర్ రాజకుటుంబం బహూకరించిన తలపాగాను ప్రధాని ధరించారు. జామ్‌నగర్ ప్రాంత ఘన సంస్కృతిని ఆ తలపాగా ప్రతిబింబిస్తుందని జామ్‌నగర్ ఎంపీ పూనాబెన్ తెలిపారు. ఈ తలపాగాను ప్రధాని ధరించటం గర్వంగా ఉందన్నారు.