ముంబయి, మార్చి 8 (న్యూస్‌టైమ్): క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఐపీఎల్ 2021 షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. కరోనా నేపథ్యంలో కేవలం ఆరు స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించనున్నారు. ఇటీవలే ప్రారంభమైన నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్)తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఏప్రిల్ 9న చెన్నై వేదికగా జరగనుంది. ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో జట్టు మొత్తం నాలుగు స్టేడియాల్లో ఆడుతాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు స్టేడియాల్లో పదేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఢిల్లీ, అహ్మదాబాద్‌లో మాత్రం 8 చొప్పున మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈసారి స్పెషల్ ఏంటంటే? ఏ జట్టు కూడా తమ సొంత గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడబోదు. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ 03.30కి ప్రారంభమవుతుంది. రాత్రికి జరిగే మ్యాచ్ 07.30కి ప్రారంభమవుతుంది.