రిపబ్లిక్ టీవీ కథనాన్ని ఖండించిన వైకాపా నేతలు..
అమరావతి, మార్చి 9 (న్యూస్‌టైమ్): వైకాపాలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని ప్రముఖ ఆంగ్ల ఛానెల్ ‘రిపబ్లిక్ టీవీ’ కథనాన్ని ప్రసారం చేసింది. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా పార్టీలో కొందరు తిరుగుబాటు పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనికి ఒక సీనియర్ నాయకుడు, మరి కొందరు ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారని ‘రిపబ్లిక్ టీవీ’ పేర్కొంది. ముఖ్య నాయకుల తిరుగుబాటు విషయం తెలిసి ‘జగన్మోహన్‌రెడ్డి’ వెంటనే పార్టీ కోర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారని ఆ కథనం సారాంశం. అయితే ఈ కథనాన్ని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. రిపబ్లిక్ టీవీలో వచ్చిన కథనం అసత్యం, ఆ ఛానల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా ఆ ఛానెల్ ఇదే విధంగా వ్యవహరించిందని, బాధ్యతారాహిత్యంగా, నీచ కథనాలను ప్రసారం చేస్తోందని, నాలుగు రోజుల క్రితం కూడా ఇదే విధంగా ఒక స్టోరీ వేశారని, అంతర్జాతీయంగా ఆర్థిక లావాదేవీలు, అక్రమాలకు సంబంధించి ఎపి ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడి మీద భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని ప్రచారం చేశారని, దీన్ని ‘చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు ట్వీట్ చేసి హడావుడి చేశారని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వదిలేశామని, ఇప్పుడు మరలా పార్టీలో తిరుగుబాటు జరుగుతుందని ప్రచారం చేస్తుందన్నారని ఇది సరికాదన్నారు. ‘జగన్’ను ఎదుర్కోలేక కొన్ని శక్తులు ఈ ప్రయత్నం చేస్తున్నాయని, తమ పార్టీ ఐదుకోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తుందని, వీటన్నింటిని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు.
‘ఆర్నాబ్’ జాతికి పట్టిన పీడ…!
తాము జర్నలిజాన్ని గౌరవిస్తామని, కానీ ఈ రోజు రిపబ్లిక్ టీవీలో వచ్చిన కథనం చూసి బాధ వేసిందని, ఏమీ లేకుండానే ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయడం, పరిస్థితి ఎంత ప్రశాంతంగా ఉంటే సంక్షోభం, తిరుగుబాటు ఎక్కడ? దేనికైనా ఒక హద్దు పద్దు ఉండదా..? జర్నలిజమ్ అంటే ఇదేనా..? ఆ ఛానల్‌ను లీడ్ చేసిన వ్యక్తి అర్నాబ్ జాతికి పట్టిన చీడ, ఒక మెర్సినరీ అని ఇప్పటికే చాల మంది తిట్టిపోశారని ‘సజ్జల’ విమర్శించారు. ‘ఆర్నాబ్’కు ‘చంద్రబాబు గురువేమో..అందుకే ఇటువంటి వార్తలను ప్రసారం చేస్తున్నారన్నారు. గతంలో కూడా ఇటువంటి వార్తలు వేశారని, ‘జగన్’ ఎన్డీఏలో చేరబోతున్నారని ప్రచారం చేశారని, కనీసం వివరణ కూడా తీసుకోలేదని, దీనిపై లీగల్‌గా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ‘సజ్జల’ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంగ్ల ఛానెల్ బిజెపికి అనుకూలంగా ఉంటుందనే ప్రచారం ఉంది. జాతీయ స్థాయిలో ఆర్నాబ్ బిజెపిని వెనకేసుకు వస్తుంటారు. దేశ రాజకీయాల్లో బిజెపికి అనుకూలంగా ఉండే ‘వైకాపా’పై బిజెపికి అనుబంధంగా ఉంటుందనే విమర్శలు ఎదుర్కొంటున్న ‘రిపబ్లిక్’ ఛానెల్‌లో ‘జగన్’కు వ్యతిరేకంగా వార్తలు రావడం నిజంగా విశేషమే. రాష్ట్ర స్థాయిలో కొంత మంది బిజెపి నాయకులు తప్ప దాదాపు చాలా మంది ‘జగన్’కే అనుకూలంగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ‘బిజెపి’ని సమర్థించే ఛానెల్‌లో పదే పదే ‘జగన్’ పార్టీకి, ‘జగన్’కు వ్యతిరేకంగా వార్తలు రావడం వైకాపా అభిమానులకు, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు పార్టీలో ఏమి జరుగుతుందోనన్న శంకవారిలో కలుగుతోంది.