మూడో విడత ఎన్నికలపై ఎస్ఈసీ హర్షం

అమరావతి, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): మూడో విడత పంచాయతీ ఎన్నికలలో ఓటర్లు చైతన్యంతో ముందుకు రావటం పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఓటర్లు నిలబెట్టారని కితాబునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఓటర్లు నిలబెట్టారని ప్రశంసించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలున్నప్పటికీ అంతా సహకరించారని కొనియాడారు.

ఏజెన్సీలో సుమారు 350 పోలింగ్‌ కేంద్రాల్లో బహిష్కరణ పిలుపును సైతం తిరస్కరించి గిరిజన ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేశారని కితాబిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయురాలు దైవ కృపావతి అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కృపావతి కుటుంబ సభ్యులకు ఎన్నికల కమిషన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోందన్నారు. విజయనగరం జిల్లా చౌడువాడలో జరిగిన హింసాత్మక ఘటనను అక్కడ విధి నిర్వహణలోని కానిస్టేబుల్‌ కిషోర్‌కుమార్‌ సమర్దంగా నియంత్రించారని, ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని అభినందించారు. చివరి విడత ఎన్నికల్లోను పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

Latest News